Thursday 6 February 2020

యుద్ధ కాండము-22


శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-22
కుంభకర్ణుని మేల్కొల్పుట
రావణుడు, రాముని బాణములకు భయపడి, దర్పములుడిగి, చెదిరిన మనసుతో లంకలో ప్రవేశించెను. వసిష్ఠుని చేతిలోని బ్రహ్మదండము వలె రాముని బాణములను తలచుకొని మిక్కిలి భయభీతుడయ్యెను. మనసు కుదుటబడక సభలోకి వెళ్లి రాక్షస ప్రముఖులను చూచి ఇట్లు పలికెను.
విదితం మానుషం మన్యే రామం దశరథా౭౭త్మజం
ఇక్ష్వాకు కుల నాథేన అనరణ్యేన య త్పురా        6.60.8
 ఉత్పత్యతే హి మద్వంశే పురుషో రాక్షసా౭ధమ
 య స్త్వాం సపుత్రం సా౭మాత్యం సబలం సా౭శ్వ సారథిం     6.60.9
 నిహనిష్యతి సంగ్రామే త్వాం కులా౭ధమ దుర్మతే
 శప్తో౭హం వేదవత్యా చ యదా సా ధర్శితా పురా 6.60.10
 సే౭యం సీతా మహా భాగా జాతా జనక నందినీ
 ఉమా నందీశ్వర శ్చా౭పి రంభా వరుణ కన్యకా  6.60.11
 యథోక్తా స్తపసా ప్రాప్తం న మిథ్యా  ఋషి భాషితం
"నేను ఎంతో తీవ్రమగు తపస్సు చేసితిని. అంతయు వ్యర్థమైనది. ఒక మనుష్యుడు నన్ను ఓడించినాడు. మనుష్యుల వలన చావు రాకూడదని నేను బ్రహ్మ దగ్గర వరము కోరుకొనలేదు. లోగడ ఇక్ష్వాకు వంశజుడైన అనరణ్యుడు, వేదవతి, ఉమ (పార్వతి), నందీశ్వరుడు, నలకూబరుడు, బ్రహ్మ ఇచ్చిన శాపములు వ్యర్థము కావు కదా! కుంభకర్ణుడు బ్రహ్మ శాపముచే నిద్రించినది మొదలు ఆరు మాసముల వరకు లేవడు. అతడు నిద్రావశమున యున్నాడు. అతడు అప్రతిమ గంభీరుడు. దేవదానవులు దర్పమును అణచగలవాడు. అతడు సర్వ రాక్షస శ్రేష్ఠుడు. యుద్ధములో ఇద్దరు రాజపుత్రులను, వానరులను శీఘ్రముగా వధింప గలడు.  నిద్రాపరవశుడై యున్న కుంభకర్ణుని నిద్రలేపుము" అని రావణుడు ఆజ్ఞాపించాడు. ఇట్లు రాక్షస రాజు పలుకగనే కుంభకర్ణుని నిద్రలేపుటకు కుంభకర్ణభవనమునకు రాక్షసులు బయలుదేరిరి. రావణాజ్ఞను అనుసరించి మాంసము, రక్తము మొదలగు ఆహారపదార్థములు, పరిమళ ద్రవ్యములు, రకరకముల భక్షములను తీసుకొని కుంభకర్ణుడు నిద్రించుచున్న గుహకు చేరుకొనిరి. చందనమును అతని ఒడలిపై పూసిరి. ధూపము వేసిరి. పెద్ద పెద్ద కేకలను వేసిరి. శంఖములను పూరించిరి. మేఘముల వలె గర్జించిరి. ఇటునటు కదిల్చిరి. సింహనాదములను చేసిరి. పెద్ద పెద్ద సుత్తులతో మోదిరి. రోకళ్ళతో, గధలతో ప్రహరించిరి. పర్వత శిఖరములను, వృక్షములను మీద పడవేసిరి. కొన్నివేల మంది ఒక్కసారి గొడ్డళ్లను, పానవములను, భేరీలు, శంఖములను, కుంభములను మ్రోగించి ధ్వని చేసిరి. పెద్ద పెద్ద కాష్ఠములతో, స్తంభములతో తమ శక్తి యున్నంత వరకు పూనిక కొట్టిలేపిరి. కొందరు అతని కేశములు ఊడబెరికిరి. చెవులు కొరికిరి. చల్లటి నీటిని అతని చెవులలో పోసిరి. మహానిద్రావశుడై యున్న కుంభకర్ణుడు నిద్ర లేవలేదు. వేయి ఏనుగులను తెప్పించి అతని శరీరముపై పరిగెత్తించిరి. అప్పడుగాని కుంభకర్ణునికి కొంచెము తెలివి వచ్చి స్పర్శ గ్రహించాడు. కొంత సేపటికి నిద్ర మత్తు తొలగినది. ఆకలి అధికముగా వేయుచున్నది. పెద్దగా ఆవలించుతూ లేచెను. పెద్ద పెద్ద రెండు పర్వత శిఖరములు కదలి వచ్చుచున్నావా అనునట్లు రెండు బాహువులను చాచాడు. అతని ముఖము పాతాళము వలె అగాథము అయి కనబడెను. అతని కనులు కాలాగ్ని వలె, రెండు గ్రహ గోళముల వలె మెరయు చుండెను. ఆకలితో వివిధములైన భక్ష్యములను, వరాహములను, మహిషములను తినెను. రక్తమును త్రాగెను. తృప్తి కలిగిన కుంభకర్ణుడు రాక్షసులను చూచి భయపడవలదు అని ధైర్యము చెప్పెను. తనను నిద్రలేపుటకు గల కారణమడిగెను. అప్పుడు విరూపాక్షుడను రాక్షస మంత్రి నర (రామలక్ష్మణులు), వానరులు లంకను చుట్టుముట్టారు. యుద్ధములో రావణుడు ఓడిపోయి వంటరివాడు కాగా రాముడు ప్రాణములు పోయే పరిస్థితి కల్పించి వదిలినాడు. ఇంతకంటే రావణునికి పరాభవమేముండును? అప్పుడు కుంభకర్ణుడు వెంటనే యుద్ధభూమికి వెళ్లి రామలక్ష్మణులను, వానరులను చంపి రావణ దర్శనము చేసుకొనెదని అనెను. అప్పుడు మహోదరుడు, రాముని ఒక్కడు ఎదురించుట సాధ్యము కాదు కావున ముందుగా రావణుని కలవవలెనని చెప్పెను. ఈ వార్త వారంతా రావణునికి తెలియజేసిరి. కుంభకర్ణుడు సోదర భవనమునకు వెళ్లునప్పుడు రాక్షసులు చేతులు జోడించి నిలిచిరి. వానరులు ఒక పెద్ద కొండ శిఖరము నడచి వెళ్లుచున్నట్లు అనుకోని భయపడి రాముని శరణు వేడిరి. 

No comments:

Post a Comment