Wednesday 19 February 2020

యుద్ధ కాండము-35

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-35
రామబాణములకు కలత చెందిన రావణుని చూచి, సారథి రథమును యుద్ధభూమి నుండి ప్రక్కకు త్రిప్పుట
‌లక్ష్మణుని మాటలు విని శ్రీరాముడు శత్రువులను సంహరింప నిశ్చయించి ధనస్సును చేపట్టెను. రథముపై రావణుడు, నేలపై రాముడు యుద్ధము చేయదగదని యోచించి దేవరాజగు ఇంద్రుడు తన సారథి యగు మాతలిచే స్వర్గము నుండి రథమును రాముని  వద్దకు పంపెను. మాతలి రాముని వద్దకు వచ్చి రామా! ఇంద్రుడు నీకు విజయము సమకూర్చవలెనని ఈ రథమును పంపినాడు. ఇందు ఇంద్రునిచే పంపబడిన అమోఘమైన విల్లు, కవచము, శక్తి ఉన్నవి. అందుకు సమ్మతించిన రాముడు ఆ రథమునకు ప్రదిక్షణ చేసి నమస్కరించి రథమును అధిరోహించెను. ఆనాడు రామరావణుల యుద్ధము ఓడలు గగుర్పొడుచునదిగా యుండెను. రావణుడు వేసిన గాంధర్వాస్త్రమును రాముడు దైవాస్త్రముచే కొట్టెను. రావణుడు రాక్షశాస్త్రమును, రాముడు గరుడాస్త్రముచే నిరోధించెను. తన అస్త్రములన్నియు నిష్ఫలములు అగుట చూచి రావణుడు ఓర్వలేక ఘోరమగు బాణవర్షమును గురిపించగా రాముడు ధనస్సును సంధింప జాలని వాడై యుండెను. అప్పుడు రావణుడు పది ముఖములతో ఇరువది బాహువులతో మైనాక పర్వతము వలె కనబడెను. అప్పుడు కోపముతో, కన్నులు ఎర్రబారిన రాముని చూచుటకు రావణుడు, సర్వ భూతములు కలత చెందెను. "రామాజయ" అని దేవతులు, "రావణా జయ" అని రాక్షసులు పలుకుచుండిరి. రావణుడు మహత్తరమగు శూలమును చేపట్టి రామునిపై విసరగా, అది మెరుపులతో, ఎనిమిది గంటలతో ధ్వని చేయుచు అంతరిక్షమున వచ్చుటకు చూచి రాముడు దానిని తన బాణములతో నివారించుటకు ప్రయత్నించెను. కానీ ఆ శూలము రామబాణములను అగ్ని ముడుతలను దహించినట్లు దహించి వేసెను. అప్పుడు రాముడు కోపముచే ఇంద్రుడు మాతలిచే పంపిన శక్తిని రావణుని శూలముపై ప్రయోగించెను. ఆ శక్తి యొక్క గంటలు పెద్ద ధ్వని చేయుచు ఆకాశములో ఉల్కలు సంచరించునట్లు శూలముపై పడెను. రాముడు ప్రయత్నపూర్వకంగా రావణుని లలాటము నందు కొట్టగా రావణుడు కూడా అంతే తీవ్రముగా ప్రతిస్పందించెను. రాముడు కోపముతో రావణుని చూచి పరుషముగా "రాక్షసరాజా! జనస్థానమున నా భార్యను ఒంటరిగా యున్నదానిని అపహరించి తెచ్చితివి. నీచునిలా ప్రవర్తించితివి. నేను చూచుచుండగా నీవు సీతను తెచ్చినచో ఆనాడే నీవు మరణించి యుండెదవు. నీ అదృష్టము వలన నీవు నా కంట బడలేదు. నేడు కనబడినావు గాన ఇక నీవు జీవించుట దుర్లభము" అని పలుకుచు పరాక్రమముతో రావణునిపై బాణమును ప్రయోగించెను. అప్పుడు రావణుడు ప్రతీకారము చేయలేక మృత్యువు ఆసన్నమయినదా అనునట్లుండెను. అప్పుడు సారథి రావణుని అవస్థ చూచి మెల్లగా యుద్ధభూమి నుండి రథమును ప్రక్కకు తీసికొనిపోయెను. అందుకు కోపించిన రావణుడు సారథితో "నన్ను నీవు వీర్యము లేనివాడిగా, అశక్తునిగా, పౌరుషము లేనివాడిగా, పిరికివానిగా, ధైర్యము లేనివానిగా, తేజోవిహీనునిగా అనుకొంటివి". శత్రువు చూచుచుండగా నా రథమును ప్రక్కకు నడుపుటచే నేను చిరకాలము నుండి సంపాదించిన కీర్తి, పరాక్రమము, తేజస్సు, ఆత్మవిశ్వాసము నీ వలన నాశనము చేయబడినది" అని తీవ్రముగా సారథిని నిందించెను.
శత్రోః ప్రఖ్యాత వీర్యస్య ర౦జనీయస్య విక్రమైః
పశ్యతో యుద్ధ లుబ్ధోఽహం కృతః కాపురుష స్త్వయా 6.106.6
నా అదృష్టము వలన ప్రసిద్ధమైన పరాక్రమము గల శత్రువు దొరికినాడు. పరాక్రమముతో అతనిని మెప్పించి సంతోషింప చేయదగిన అవకాశము లభించినది అట్టివానితో యుద్ధము చేయవలెనని నేను కోరుచున్నాను. కావున వెంటనే వేగముగా రథమును వెనుకకు మరలింపుము అని ఆజ్ఞాపించెను. సారథి రావణుని హితమును కోరినవాడు. అనునయముతో ఇట్లు పలుకుచున్నాడు. "శత్రువు చేసిన మోసాలకు లొంగినవాడను గాను. వారు నాకు రహస్యముగా లంచమిచ్చి ఆశలు చూపలేదు. మూఢుననుఁ గాదు. మీపై ప్రేమ లేనివాడను గాదు. మీ హితమును మరువలేదు. యుద్ధములో రామబాణం తీవ్రతచే మీరు కొద్దిగా అలసి యున్నారు. మీ ముఖములో కాంతిగాని, హర్షముగాని నాకు కనబడలేదు. గుఱ్ఱములు బాగుగా బడలి యున్నవి. అశుభ చిహ్నములు అధికముగా పొడసూపినవి. సారథి దేశకాలములను గుర్తింపవలెను. రథికుని యొక్క ముఖములో ప్రసన్నత, దైన్యము గమనించ వలెను. కావున రాజా! నీకు, గుఱ్ఱములకు విశ్రాంతి ఒసగవలెనని తీవ్రమగు సహింప శక్యముగాని యుద్ధము నుండి ఒక్క క్షణము విరమింపవలెనని ఖేదము తొలగవలెనని ఈ రథమును ప్రక్కకు తెచ్చినాను. మీరు ఇప్పుడు ఎట్లు ఆజ్ఞాపించిన అట్లు చేయుదును" అని చెప్పెను. అప్పుడు రావణుని కోరికపై సారథి రథమును మరల యుద్ధభూమికి నడిపెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment