Tuesday 18 February 2020

యుద్ధ కాండము-34

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-34
రావణుడు యుద్ధమునకు బయిలుదేరుట, రావణుని శక్తిచే లక్ష్మణుడు మూర్ఛ నొందుట
‌లంకలో ఇంటింటా ఆర్తలైన రాక్షస స్త్రీల జాలిగొలుపు రోదన ధ్వనులు రావణుడు వినెను. అతనిలో కోపము ప్రజ్వలించెను. అక్కడ యున్న మహాపార్శ్వుడు మొదలుగా గల సైన్యములను సిద్ధపరచెను. రావణుడు సత్వగంభీరుడు. మహాపార్శ్వ, మహోదర, విరూపాక్షులు ఆదిగా గల సైన్యము వెంట రాగ రావణుడు అనేకమైన ఉత్పాతములను లెక్కజేయక మృత్యుప్రేరితుడై యుద్ధమునకు బయలుదేరెను. క్రోధముచే రావణుని బాణపరంపరకు వానరులు శిరస్సులు ఖండింపబడి కకావికలులైరి. వానరులతో యుద్ధము చేసి రావణుడు శ్రీరాముని చెంతకు వచ్చెను. సుగ్రీవుడు వానరులకు ధైర్యము చెప్పి విరూపాక్షుని మహోదరుడిని సంహరించెను. అంగదుడు మహాపార్శ్వుని సంహరించెను. అప్పుడు రావణుడు క్రోధముతో తామసమగు బ్రహ్మ నిర్మించిన మహాఘోరమగు అస్త్రముచే వానరులను నేల పడగొట్టెను. పద్మపత్ర విశాలాక్షుడు, దీర్ఘబాహువు, మాహాతేజశ్శాలీ అగు రాముడు వానరులకు ధైర్యము నొసగుచు ధనుస్సు చేబూని టంకారము గావించెను. లక్ష్మణుడు ముందుగా తాను యుద్ధము చేయవలెనని కుతూహలంతో రావణునిపై అగ్నిజ్వాలలు వంటి బాణములను రావణునిపై ప్రయోగించెను. రావణుడు లక్ష్మణుని లెక్కజేయక రాముని ముందు నిలిచి తీవ్రమైన బాణవర్షమును గురిపించెను. రాముడు రౌద్రముతో రావణునిపై వరుసగా రౌద్రాస్త్రమును, పరమాస్త్రమును ప్రయోగించెను. రావణుని కవచము అభేధ్యము. రావణుడు అసురాష్ట్రమును ప్రయోగించగా రాముడు ఆగ్నేయాస్త్రమును, పావకాస్త్రమును ప్రయోగించెను. రావణుడు తీవ్రమైన కోపముతో బాణములతో రాముని మర్మస్థానములపై కొట్టెను. అందుకు కోపించిన లక్ష్మణుడు బాణములతో రావణుని ధ్వజమును కొట్టి , సారథిని చంపగా, విభీషణుడు తన గదతో గుఱ్ఱములను నేలకూల్చెను. రావణుడు మహాశక్తిని విభీషణునిపై ప్రయోగించగా దానిని లక్ష్మణుడు ముక్కలు జేసెను. అప్పుడు రావణుడు తన అస్త్రము విభీషణునిపై నిష్ఫలము అయినది అనే ఆక్రోశముతో, లక్ష్మణునిపై ఎనిమిది గంటల మహాధ్వనితో యున్న శక్తిని ప్రయోగించగా రాముడు చూచి (స్వస్త్య ౭స్తు లక్ష్మణా యేతి మోఘా భవ హతోద్యమా) "లక్ష్మణునికి క్షేమము కలుగు గాక. నీలోగల ప్రాణహరణ శక్తి నశించుగాక" అని అనెను.  ఆ శక్తి లక్ష్మణుని వక్షస్థలముపై బడి బలముగా నాటుకొని భూతలముపై నాటుకొనెను. (ముక్తా శూరస్య భీతస్య లక్ష్మణస్య మమజ్జ సా) రాముని వచనముల ప్రభావము వలన అది ప్రాణహరణ శక్తి కోల్పోయి యుండెను.  బలశాలియైన రాముడు ఆ శక్తిని తన రెండు చేతులతో బయిటకు లాగి  విరచి వేసెను. రాముడు అట్లు శక్తిని లాగుచున్నప్పుడు రావణుడు బాణములతో రాముని అవయవములపై కొట్టెను. అప్పుడు రాముడు క్రుద్ధుడై సుగ్రీవాదులతో లక్ష్మణుని జాగ్రత్తగా చూసుకొనమని చెప్పి (అరావణమ్ అరామం వా జగ ద్ద్రక్ష్యథ వానరాః) ఈ జగత్తు నందు రాముడో లేక రావణుడో మిగిలి యుండుట తథ్యమని ప్రతిజ్ఞ చేసెను. ఇట్లు పలికి వాడియగు బాణములతో రావణుని కొట్టెను. తన బహిప్రాణమగు లక్ష్మణుడు యుద్ధభూమిలో పడియుండుట జూచి రాముడు మిగుల చింతాక్రాంతుడయ్యెను. అప్పుడు రాముడు (దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా: తం తు దేశం న పశ్యామి యత్ర  భ్రాతా సహోదర:) ఏ దేశములో నైనను భార్యలు లభింతురు. బంధువులు సమకూరుదురు. కానీ తోడబుట్టిన సోదరుడు లభింపడు అని విలపింపుట చూచి సుషేణుడు రామునితో ఇతను చనిపోలేదు అనెను, అప్పుడు హనుమతో వెంటనే వెళ్లి విశల్య కరణి, సంధాన కరణి, సవర్ణ కరణి, సంజీవని అను ఓషధులను వేగముగా తేవలెనని చెప్పెను. వెంటనే హనుమ ఆ ఓషదిపర్వతము వద్దకు వెళ్లి ఓషధులను గుర్తింపజాలక ఆ ఓషధిపర్వతమును పెకలించుకొని వచ్చెను. సుషేణుడు ఆయా ఓషధులను నూరి లక్ష్మణునికి వాసన చూపగానే అతను పూర్వ శక్తితో లేచి నిలబడెను. లక్ష్మణుడు అప్పుడు రామునితో రావణుని చంపి విభీషణునికి లంకారాజ్యమును పట్టాభిషేకము చేసెదనని ప్రతిజ్ఞ చేసినావు గాన రావణుని చంపి ప్రతిజ్ఞ సూర్యుడు అస్తమించక మునుపే నెరవేర్చమని చెప్పెను.అందుకు శ్రీరాముడు శత్రులను నిర్జింప నిశ్చయించి ధనస్సును చేపట్టెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment