Monday 24 February 2020

యుద్ధ కాండము-39

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-39
రావణ మృతికి విభీషణుని విలాపము, రాముని అనునయము
సోదరుడు చనిపోయి నేలబడి యున్నాడు. శోకము పెల్లుబికిన విభీషణుడు ఇట్లు విలపింప సాగెను. "నీవు పరాక్రమశాలివి. లోక ప్రఖ్యాతి నొందినవాడివి. శాస్త్రములలో శిక్షణ పొందినవాడివి. అట్టి నీవు ఇప్పుడు నిర్జీవంగా నేలపై పరుండినావు. వెనుక నేను నీకు ఇట్టి దశ వచ్చునని చెప్పియుంటిని. ఆనాడు నా మాటలు నీకు రుచింపలేదు. నీతి మార్గ ప్రవర్తనను, మర్యాదను అతిక్రమించితివి. ధర్మమును నిరోధించితివి. రావణుడు మహాగ్నిహోత్రము. అట్టి అగ్నిని రాముడనే మేఘము చల్లార్చినది". ఈ విధముగా విభీషణుడు శోకించుట చూచి, అర్థ నిశ్చయమును ప్రకట మొనర్చు యుక్తి సంగతములైన మాటలు చెప్పుచు శ్రీరాముడు శోకమగ్నుడగు విభీషణునితో ఇట్లు పలికెను.
నా౭యం వినష్టో నిశ్చేష్ట స్సమరే చండ విక్రమ:
అత్యున్నత మహోత్సాహ: పతితో౭య మశంకిత:           6.112.౧౫
నైవం వినష్టా శోచ్యన్తే క్షత్ర ధర్మ మ౭వస్థితా
వృద్ధి మా౭౭శంసమానా యే నిపతంతి రణా౭జిరే 6.112.16
త దేవం నిశ్చయం దృష్ట్వా తత్త్వ మా౭౭స్థాయ విజ్వర:
య దిహా౭నంతరం కార్యం త ద౭నుచిన్తయ 6.112.20
మరణా౭౦తాని వైరాణి నిర్వృత్తం న: ప్రయోజనం
క్రియతా మ౭స్య సంస్కారో మమా౭ప్యేష యథా తవ 6.112.26
విభీషణా! ఈ వీరుడు యుద్ధము నందు అసమర్థుడై చావ లేదు. ఇతను ప్రచండమైన పరాక్రమమును ప్రకటించెను. ఈతని ఉత్సాహము చాల గొప్పది. ఈతనికి మృత్యువు యెడల ఏ విధమైన భయము లేదు. దైవికముగా ఇతడు యుద్ధమున పడిపోయెను. ఎవరు తమ అభ్యుదయమును గూర్చిన కోరికచే క్షత్రియ ధర్మమందు నిలకడ కలిగి యుద్ధమందు చంపబడుదురో ఆ ప్రకారముగా నశించు జనుల విషయమై శోకించరాదు. శాస్త్రము యొక్క ఇట్టి నిశ్చయమును తెలుసుకొని, సాత్విక బుద్ధిని ఆశ్రయించి నీవు నిశ్చింతగా యుండుము. మరియు ఇప్పుడు ముందు చేయదగిన (ప్రేత సంస్కారము మొదలైన) పనుల విషయమై ఆలోచించుము. విభీషణా! వైరములు మరణము వరకే. మరణించిన పిదప ఆ వైరములు నశించును. ఇప్పుడు మన ప్రయోజనము సిద్ధించింది. కావున ఇపుడు నీవు ఈతని ప్రేత సంస్కారమును గావింపుము. ఈ సమయమున యీతడు నీకెట్లు స్నేహమునకు పాత్రుడై యున్నాడో అట్లే నాకును స్నేహభాజనుడై యున్నాడు.
శ్రీరాముడిట్లు పలుకగా శోకతప్తుడైన విభీషణుడు వారితో తన సోదరునకు హితకరమైనట్టి ఈ వాక్యమును పలికెను.
ఏషో హితా౭గ్ని శ్చ మహా తపా శ్చ 
వేదాన్తగ: కర్మసు చా౭గ్ర్య వీర్య:
ఏతస్య య త్ప్రేత గతస్య కృత్య౦
తత్ కర్తు మిచ్ఛామి తవ ప్రసాదాత్ 6.112.24
ఈ రావణుడు అగ్నిహోత్రియు, మహాతపస్వియు, వేదాంత వేత్తయు, యజ్ఞ యాగాది కర్మలందు శ్రేష్ఠుడైన శూరుడును, మహా కర్మఠుడును అయియున్నాడు. కావున మీ కృపచే నేనే ఇపుడాతని ప్రేతకర్మను చేయదలిచాను.
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment