Thursday 27 February 2020

యుద్ధ కాండము-42

[05:48, 28/02/2020] +91 96180 14862: శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-42
శ్రీరాముని విజయ వార్త సీతాదేవికి తెలుపుట
‌శ్రీరాముడు తన ప్రక్కనే యున్న హనుమతో; "హనుమా! మహారాజగు విభీషణుని అనుమతితో, నీవు లంకలో ప్రవేశించి, రావణ భవనమునకు వెళ్లి విభీషణుని విజయమునకు అతనిని అభినందించుము. అటనుండి వైదేహి వద్దకు యేగి, లక్ష్మణునితో, సుగ్రీవునితో కలసి మేము కుశలముగా యున్నామని, రావణ సంహార మైనదని చెప్పుము. ప్రియమైన ఈ వృత్తాంతమును ఎఱింగించి, ఆమె సందేశమును తీసుకొని రమ్ము" అని ఆదేశించి పంపెను. రామాజ్ఞచే వెంటనే హనుమ అశోకవనమున ప్రవేశించి శరీర సంస్కారము లేకుండా, గ్రహ పేడతో కూడిన రోహిణి నక్షత్రము వలె వృక్షమూలమున ఆనందము లేనిదై రాక్షస స్త్రీలతో ఆవరింపబడి యున్న సీతను చూచెను. హనుమ సీతను చూచి నమస్కరించగా ఆ వచ్చినవాడు తాను పూర్వము చూచిన రామదూతయైన హనుమయేనని  సీతమ్మ గుర్తించెను.  హనుమ  సీతతో; అమ్మా! శ్రీరాముడు తన కుశల వార్త మీకు తెలియ జేయమన్నాడు. రావణుని చంపి  నిన్ను విముక్తి చేయవలెనని ప్రతిజ్ఞ పూని రావణ సంహారము చేసి యున్నాడు. హనుమ ఇట్లు చెప్పగనే సీత మనసు సంతోషముతో ఉప్పొంగినది. ఆనందముతో మాట రాక చూచుచు ఊరకుండెను. అప్పుడు హనుమ అమ్మా! నాతో మాటాడవేమి? అప్పుడు సీత హర్షముతో తొట్రువడుతున్న కంఠముతో పరమ ప్రీతితో ఇట్లు పలికెను. "హనుమా! ప్రభువు విజయ వార్తను వినుట తోడనే మనసున కలిగిన హర్షముచే మాట రాలేదు. ఈ భూమిలో ఇంత మంచి వార్తను ఎఱింగించిన నీకు కానుకగా సమర్పించుటకు ఏమియు లేదని మాటరాక ఊరకుంటిని. నీవు చెప్పిన ప్రియ వచనములను ప్రియమైన వస్తువు ఏదియు కానరావడం లేదు. (అదియే శ్రీరాముడు హనుమను గాడాలింగనము చేసుకొనెను. కానీ సీతమ్మకు అది కుదరదు కదా!)అప్పుడు హనుమ; అమ్మా!  నీవు చెప్పిన ఈ మాట పరమ ప్రీతిని కలిగించినది. హనుమ వాక్యములను విని సీత పరమ ప్రీతితో; ఆనాడు పంపాతీరమున రాముని ప్రశంసలు అందుకొన్నావు. హనుమను సీతమ్మ ఈ విధముగా ప్రశంసించుచున్నది. "నీమాట లోకాతీతమగు లక్షణములతో సంపన్నమైనది. వాక్యము నందలి పదముల ఆకాంక్ష, యోగ్యత, సన్నిధి మొదలగునవి అన్నియు ఉన్నవి. శబ్ద సాధుత్వము భంగపడుట లేదు. వినుటకు ఎంతో మధురముగా యున్నది. నీ బుద్ధి అష్టాంగ సంపన్నమైనది. బుద్ధికి ఎనిమిది అంగములు యుండవలెను. అవి గ్రాహములు, ధారణము, స్మరణము, ప్రతిపాధనము, ఊహ, అపోహ, అర్థవిజ్ఞానము, తత్వజ్ఞానము. ఇవియన్నియు నీకు యున్నవి."  సీతమ్మ ఇట్లు ప్రశంసింపగా చేతులు జోడించి అమ్మా! ఈ రాక్షస స్త్రీలు పూర్వము నేను వచ్చినప్పుడు నిన్ను బెదిరించి దూషించుట చూచాను. ఇప్పుడు నీ ఆజ్ఞ అయినచో నేను వారిని అందరిని సంహరించవలెనని అనుకొంటున్నాను. హనుమ ఇట్లు పలుకగానే వైదేహి ధర్మబద్ధముగా ఇట్లు పలికెను.
రాజ సంశ్రయ వశ్యానాం కుర్వతీనాం పరా౭౭జ్ఞయా
విధేయానాం చ దాసీనాం కః కుప్యే ద్వానరోత్తమ     6.116.38
భాగ్య వైషమ్య యోగేన పురా దుశ్చరితేన చ
మ యైతత్ ప్రాప్యతే సర్వం స్వ కృతం హ్యుపభుజ్యతే            6.116.39
ప్రాప్తవ్యం తు దశా యోగాన్ మయై తదితి నిశ్చితమ్
దాసీనాం రావణస్యా౭హం మర్షయా మీహ దుర్బలా  6.116.40
ఆజ్ఞప్తా రావణే నైతా రాక్షస్యో మామ్ అతర్జయన్
హతే తస్మిన్ న కుర్యుర్ హి తర్జనం వానరోత్తమ      6.116.41
ఈ రాక్షస స్త్రీలు రాజసేవాపరాయణులు. తమ ప్రభువు చేయమనిన పనిని చేయువారలు. పరతంత్రులు. వారు రావణుని దాసీలు. దాసీలపై కోపము తెచ్చుకొనువాడు ఎవరైనా ఉందురా? దాసీలను శాసించిన ప్రభువుపై కోపగించి వలెనే గాని దాసీలపై కాదు. నా దురదృష్టము వలన, పూర్వము ఒనర్చిన దుష్కృతముల వలన నాకు ఈ కష్టములు దాపురించినవి. కనుక వారిని క్షమింపుము.
న పరః పాపమ్ ఆదత్తే పరేషాం పాప కర్మణామ్
సమయో రక్షితవ్య  స్తు సన్త  శ్చారిత్ర  భూషణాః 6.116.43
పాపానాం వా శుభానాం వా వధా౭ర్హాణాం ప్లవంగమ
కార్యం కరుణమ్ ఆర్యేణ న కశ్చిన్ నా౭పరాధ్యతి  6.116.44
లోక హింసా విహారాణాం రక్షసాం కామ  రూపిణమ్
కుర్వతామ్ అపి పాపాని నైవ కార్యమ్ అశోభనమ్ 6.116.45
శ్రేష్ఠుడగువాడు ఇతరులకు చెడ్డచేయు పాపుల యొక్క పాపకర్మను స్వీకరించడు. మరియు త్రిగి వారి యడల పాపపూర్ణమగు ప్రవర్తనమును గావించదలచడు. ఏలయన సాధుపురుషుడు తన ఉత్తమ చరిత్రతోనే విభూషితుడు అగుచున్నాడు. సదాచారమే అతని భూషణమైనది. శ్రేష్ఠుడైనవాడు పాపియైనను, పుణ్యాత్ముడైనను వధింపయోగ్యమైన అపరాథమొనర్చిన వాడైనను, వారందరి యడల దయగలిగి యుండవలెను. ఏలయనిన అపరాథమెపుడు చేయనట్టి ప్రాణి సామాన్యముగా ఎవడును ఉండడు. జనులను హింసించువారు, సదా పాపమునే ఆచరించు వారునగు క్రూర స్వభావము గల పాపులకు కూడా అమంగళమును చేయరాదు.
సీత ఇట్లు వచింప వాక్యకోవిదుడగు హనుమ సతియు, సాధ్వియు, శ్రీరామపత్నియు అగు సీతతో ఇట్లు పలికెను. "తల్లీ! మీరు శ్రీరాముని ధర్మపత్ని. కావున అట్టి సద్గుణములతో గూడి యుండుట సముచితమే. ఇక ఇప్పుడు మీ యొక్క సందేశమును చెప్పుడు". అప్పుడు సీత "హనుమా! నేను భక్తవత్సలుడైన శ్రీరాముని దర్షింప గోరుచున్నాను" అని చెప్పెను. అటు పిమ్మట, హనుమ శ్రీరామునకు సీతా సందేశమును వినిపించగా: శ్రీరాముడు విభీషణునితో సీతమ్మను తల స్నానము చేయించి, దివ్యాభరణములతో అలంకరించి తీసుకొని రమ్మని చెప్పెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment