Thursday 27 February 2020

యుద్ధ కాండము-41

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-41
విభీషణుని పట్టాభిషేకము
దేవతలు, గంధర్వులు మొదలగు వారు ఆకాశములో నిలిచి రావణ సంహారమునకు హర్షము వ్యక్తం చేసి, ఆ వృత్తాంతమును చెప్పుకొనుచు తమ స్థానములకు ఎగిరి. శ్రీరాముడు ఇంద్రుని రథమును వెనుకకు పంపెను. తరువాత శ్రీరాముడు సుగ్రీవుని గాఢముగా ఆలింగనము చేసుకొనెను. శ్రీరాముడు, లక్ష్మణునితో "లక్ష్మణా! విభీషణుడు మనపై అనురాగము గల భక్తుడు. నాకు ఎంతయో ఉపకారము చేసినాడు. వెనుక సముద్ర తీరమున విభీషణునకు లంకారాజ్యాభిషేకము చేసినను, ఇప్పుడు విభీషణునికి సింహాసనాధీస్టుని చేసి మకుట ధారణ చేయవలెను". అని చెప్పెను. శ్రీరాముని అభిప్రాయము ప్రకారము సీతమ్మను చేపట్టుటకు ముందే శరణాగతుడైన విభీషణుని లంకారాజ్యాభిషేకము ముఖ్యము. సోదరుని అభిప్రాయము ఎరిగిన లక్ష్మణుడు వానరులతో బంగారు కలశములో సముద్ర జలములు తెప్పించెను.లంకానగర ప్రవేశము చేసినచో తన అరణ్య వాసమునకు భంగమగునని శ్రీరాముడు నగర ప్రవేశమే చేయక లక్ష్మణుని పంపెను.
తత స్త్వేకం ఘటం గృహ్య సంస్థాప్య పరమా౭౭సనే
ఘటేన తేన సౌమిత్రి: అభ్యషి౦చ ద్విభీషణమ్         6.115.14
ల౦కాయాం రక్షసాం మధ్యే రాజానం రామ శాసనాత్
విధినా మంత్ర దృష్టేన సుహృ ద్గణ సమా వృతం      6.115.15
అభ్యషి౦చత్ స ధర్మాత్మా శుద్ధాత్మానం విభీషణమ్
త స్యా౭౭మాత్యా జహృషిరే భక్తా యే చా౭స్య రాక్షసాః 6.115.16
రామాజ్ఞచే లక్ష్మణుడు జలపూర్ణమగు ఘటమును తన చేతిలో పట్టుకొని విభీషణుని సింహాసనంపై కూర్చుండ జేసి రాక్షసులందరు చూచుచుండగా మంత్రహితముగా లంకారాజుగా అభిషేకించెను. రాక్షస మంత్రులు మొదలగు వారు యుద్ధములో పోయినందుకు విభీషణుని ఓదార్చి లక్ష్మణుడు, శ్రీరాముని సన్నిధికి చేరెను.  
ఈ విధముగా విభీషణుని పట్టాభిషేకము ఈశ్వర నామ సంవత్సర చైత్ర శుద్ధ తదియ నాడు జరిగినట్లుగా బ్రహ్మాండ పురాణము తెలియు చున్నది.
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment