Saturday 8 February 2020

యుద్ధ కాండము-24


శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-24
కుంభకర్ణుని వధ
మహాతేజశ్శాలియైన రాముడు ధనస్సును ధరించి నిలిచి కుంభకర్ణుని చూసినాడు. కుంభకర్ణుడు పర్వతము వంటి దేహము కలవాడు. ఆశ్చర్యముతో రాముడు విభీషణుని అట్టి రాక్షసుడు ఎవ్వరో చెప్పమని అడిగెను. విభీషణుడు ఇట్లు చెపుతున్నాడు. "ఈతడు విశ్రవసుని కుమారుడు. రావణుడి సోదరుడు. యుద్ధములో యముని, ఇంద్రుని ఓడించాడు. మహాబలశాలి. ఇంత ఉన్నతమైన శరీరము గలవాడు వేరొకడు లేడు. దేవతలు ఈతడు మృత్యువని మోహము నొందినారు. జన్మసిద్ధముగనే ఈతడు మహాపరాక్రమశాలి. పుట్టగానే ఆకలి తీవ్రమయి ఈతడు వేలకొలది అనేకమైన జంతువులను భక్షించినాడు. అట్లు అతడు తినివేయుచున్నచో లోకములో ప్రజలే ఉండరని భయపడి ప్రజల విన్నపముపై ఇంద్రుడు వజ్రాయుధముతో ఈతనిని కొట్టెను. అందుకు ఇతను కోపించి ఐరావతము యొక్క దంతము నూడపెరికి, ఆ దంతముచే ఇంద్రుని గుండెలపై కొట్టగా అందుకు దేవతలు, ఋషులు దుఃఖించి బ్రహ్మ వద్ద మొరపెట్టుకొనిరి. బ్రహ్మకు కూడా భయము గొల్పునట్టి అతని రూపము చూడగనే, బ్రహ్మ కుంభకర్ణునితో లోకములను రక్షించుట కొరకు నీవు (కుంభకర్ణుడు) చనిపోయినట్లు పరుండెదవు అని శపించెను. రావణుడు అది చూచి బ్రహ్మతో ఈతడు మీ మునిమనవడు. చెట్టును పెంచవలసిన సమయమున నరికి వేయుట న్యాయము కాదు, నీ వాక్కు అసత్యము కానేరదు కావున తగిన ఉపాయము చేయమని ప్రార్థించెను. అప్పుడు బ్రహ్మ ఈతడు గాఢముగా ఆరు నెలలు నిద్రించును ఆ పిదప ఒక్కరోజు మాత్రమే మెలోకొనును, ఆ ఒక్క రోజుననే భూమిపై సంచరించుచున్న ప్రాణికోటిని అగ్నివలె తినుచుండును అని ఉపశమనము చేసెను. రామా! నీ పరాక్రమముచే భయము నొంది, పరాభవం పొందిన రావణుడు, కుంభకర్ణుని మేల్కొలిపినాడు.   నిద్ర లేచిన కుంభకర్ణుడు తీవ్రమగు కోపముచే వానరులను భక్షించుచున్నాడు. వానరులు అతనిని అడ్డగింపజాలరు. కావున రామా! అతను రాక్షసుడని చెప్పవద్దు. ఒక యంత్రము పైకి లేచినదని చెప్పుము. అప్పుడు వారి భయము కొంత వరకు తగ్గును. విభీషణుడు అట్లు చెప్పగానే రాముడు సేనాపతియైన నీలుని పిలిచి పెద్ద పెద్ద పర్వత శిఖరములు, చెట్లు మొదలగు ఆయుధములచే వానర ప్రముఖులైన గవాక్షుడు, శరభుడు, హనుమ, అంగదుడు మొదలగు వారు పర్వతాకారులై లంకాద్వారము వద్ద కాపుండమని చెప్పెను. కుంభకర్ణుని చూడగనే వానరులు భయభీతులై పరిగెత్తు చుండిరి. అప్పుడు వారిని చూచి అంగదుడు ఇట్లు చెప్పెను వానరులారా! ప్రాణములను రక్షించుకొనుటకు ఎక్కడికి పారిపోవుదురు. మీరు ఎక్కడికి వెళ్లినను కుంభకర్ణుడు మిమ్ములను వెంటాడి వెంటాడి చంపును. లేదా రాజాజ్ఞ లేకుండా యుద్ధ రంగము నుంచి పారిపోయినందుకు సుగ్రీవుడు మిమ్ములను బ్రతుకనీయడు. ఈ రాక్షసుడు మనముందు యుద్ధమునకు జాలడు. కేవలము మనను భయపెట్టుటకు చేయు ప్రయత్నము మాత్రమే! అని వారికి అంగదుడు ధైర్యము నూరిపోయగా వారు వెనుకకు వచ్చి మదపుటేనుగు వలె కుంభకర్ణుని కొట్టిరి. కుంభకర్ణుడు మిగుల క్రుద్ధుడై చెలరేగిన దావాగ్ని వనములను దహించి వేయునట్లు మహాబలశాలురైన వానరులను నుగ్గు నుగ్గు గావించెను. కుంభకర్ణుడు వానరులలో కొంతమందిని సముద్రములో విసిరి వేసెను. కొంతమందిని ఆకాశములో ఎగుర వేసెను.
తాన్ సమీక్ష్యా౭౦గదో భగ్నాన్ వానరాన్ ఇద మ౭బ్రవీత్   6.66.18
అవతిష్ఠత యుధ్యామో నివర్తధ్వం ప్లవంగమాః
శయామహే౭థ నిహతాః పృథివ్యా మ౭ల్పజీవితాః
దుష్ప్రాపం బ్రహ్మలోకం వా ప్రాప్నుమో యుధి సూదితాః   6.66.25
సంప్రాప్నుయామః కీర్తిం వా నిహత్య శత్రుమ్ ఆహవే
జీవితం వీరలోకస్య భోక్ష్యామో వసు వానరాః       6.66.26
అంగదుడు వారితో, ఓ వానరవీరులారా! ఆగుడు. వెనుకకు మరలుడు. వానితో మనమందరము కలసి యుద్ధము చేసెదము. మనము చిన్న శరీరము గలవారమైనప్పటికీ శత్రువుచే చంపబడి యుద్ధభూమి యందు పరుండినప్పటికీ కుయోగులకు పరమ దుర్లభమైన బ్రహ్మలోకము మనకు సంప్రాప్తించును. అట్లుకాక యుద్ధము నందు మనమే శత్రువులను వధించినచో మనకు కీర్తి లభించును. లేదా మనమే రణరంగమున అసువులు బాసినచో వీరస్వర్గ సుఖములను అనుభవింతుము. అప్పుడు కుంభకర్ణుడు, రోషముతో అంగదునిపై శూలము విసరగా దానిని చాకచక్యంగా తప్పించుకొని కుంభకర్ణుని గుండెలపై కొట్టెను. వెంటనే కుంభకర్ణుడు అంగదుని పిడికిలితో కొట్టగా అంగదుడు మూర్ఛ నొందెను. సుగ్రీవుడు కోపముతో కుంభకర్ణునిపై యుద్ధమునకు రాగా, కుంభకర్ణుడు సుగ్రీవునితో నీవు బ్రహ్మ మనవడవు[1]. ప్రసిద్ధమైన పౌరుషముగలవాడవు అని చెప్పి సుగ్రీవునితో తలపడెను. కుంభకర్ణుడు తన వాడియైన శూలముతో తలపడగా హనుమ ఆ శూలమును లాగి పట్టుకొని తన మోకాలున ఆనించి విరచెను. ఆ శూలము వెయ్యి బారువుల ఉక్కుతో చేయబడినది. వెంటనే కుంభకర్ణుడు మలయపర్వత శిఖరమును ఒకదానిని తీసుకొని సుగ్రీవుని కొట్టగా సుగ్రీవుడు తెలివితప్పి నేలపై పడెను. వెంటనే ఆ సుగ్రీవుని తీసుకొని కుంభకర్ణుడు లంకలోకి తీసుకొనిపోవుచుండెను. అప్పుడు హనుమంతుడు ఈ విధముగా ఆలోచించెను. "నేను పర్వతమంత శరీరమును పెంచి కుంభకర్ణుని చంపి వానర రాజును విడిపించెదను. అట్లు చేసినచో ఒక సేవకుని ద్వారా ప్రాణరక్షణ పొందినందుకు సుగ్రీవుని మనసుకు క్లేశము  నొందును. అతని కీర్తి మాసిపోవును. కొంచెము సేపు సైన్యము చెదిరిపోకుండా నిరీక్షించెదను" అని తలచి సైన్యము చెదిరిపోకుండా ఆపెను. కుంభకర్ణుడు సుగ్రీవుని ఎత్తుకొని రాజవీధులలో పోవుచుండగా ఎత్తైన గోపురముల నుండి రాక్షసులు పుష్ప వర్షము కురిపించగా ఆ చల్లదనానికి సుగ్రీవునికి మెలుకువ వచ్చెను. అప్పుడు తన గోళ్ళతో కుంభకర్ణుని చెవులను, పళ్లతో ముక్కును, గోళ్ళతో పక్కలను చీల్చుతూ భాధించుచుండగా కుంభకర్ణునికి కోపము వచ్చి సుగ్రీవుని క్రింద పడవేసి యుద్ధము చేసెను. అట్లు క్రిందపడవేయగనే సుగ్రీవుడు తప్పించుకొని ఒక్కసారి పైకెగిరి రాముని వద్దకు వచ్చి చేరెను. అప్పుడు కుంభకర్ణుడు మరల కోపము తెచ్చుకొని ఓడలు తెలియక వానరులను, రాక్షసులను, పిశాచులను, ఎలుగుబంట్లను కూడా తినివేయుచుండెను. అప్పుడు వానరులు భయపడి రాముని వద్దకు పరిగెత్తగా, లక్ష్మణుడు యుద్ధము చేయుటకు సిద్ధమయ్యెను. కుంభకర్ణుడు లక్ష్మణుని వదిలి తిన్నగా రాముని వద్దకే వెళ్లెను. రాముడు రౌద్రాస్త్రమును ప్రయోగించగా, ఆ రామాస్త్ర బాణమునకు  దెబ్బతిన్న కుంభకర్ణుడు భయంకరముగా అరచుతూ, వానరులను చెదరకొట్టుచు పరిగెత్తెను. చేతిలోని ఆయుధములన్నియు జారిపోయినవి. అయినను చేతులతోనే యుద్ధము చేయుచుండెను. రాముడు కోపముతో, పూర్వము వాలిని వధియించినది, ఏడు మద్దిచెట్లను చేధించినది అయినట్టి బాణమును కుంభకర్ణునిపై ప్రయోగించగా, అది అతనికి ఎట్టి వేదనను కలుగచేయలేదు. రాముడు వెంటనే కుంభకర్ణునిపై వాయువ్యాస్త్రమును ప్రయోగించెను. అది కుంభకర్ణుని ముద్గరమును చేతితో సహా ఖండించెను. అప్పుడు కుంభకర్ణుడు రెండవ చేతితో ఒక చెట్టును పెకలించి రామునిపైకి పరిగెత్తెను. అప్పుడు రాముడు ఐన్ద్ర అస్త్రముతో రెండవ భుజమును ఖండించెను. రెండు అర్థచంద్రాకార బాణములతో అతని రెండు పాదములను ఖండించెను. నోరు తెరుచుకొని వచ్చుచుండగా అతని నోటిని బాణములతో నింపెను. మరియొక వజ్రపు మొనగలిగిన బాణముతో కుంభకర్ణుని శిరస్సును చేధించెను. దేవతలు, వానరులు అందరూ సంతసించిరి. 
కుంభకర్ణుడు అనగా కుంభముల వంటి చెవులు గలవాడు. కేవలము శ్రవణము ద్వారా పూర్ణ జ్ఞానము సాధించాను అని అనుకొనెడిసాధక వృత్తి. పర్వతాకారుడు మరియు అతి నిద్రాలోలుడు. అనగా సాధకుని యందలి వృత్తులు సూర్యుని ప్రకాశముచే (జ్ఞానముచే) ఎప్పుడు మేల్కొనకుండా అవిద్యచే యుండుట. అట్టి అవిద్యా రూపమైన కుంభకర్ణుని ముక్కు చెవులు కోసి ఆకర్షణ విహీనము చేసి రామ సాధకుడు సంహరింప వలెను.
శ్రీరామ జయరామ జయజయ రామ
[1] బ్రహ్మదేవుని మానస పుత్రుడు ఋక్షరజసుడు. అతడు ఒకనాడు ఒక సరస్సులో మునగగా అందమైన స్త్రీమూర్తిగా మారెను. (పార్వతీదేవి స్నానవిహారాదులను గావించెడి సరస్సులో రాక్షసులు మునుగ సాగిరి. అందులకు కుపితయైన పార్వతి ఆ సరస్సులో స్నానము చేసిన పురుషులు స్త్రీలుగా మారుదురని వచించెను. అట్లు ఆ శాపమునకు గురియైన ఆ సరస్సుయే ఋక్షరజసుడు మునిగిన సరస్సు). స్త్రీ మూర్తిగా మారిన అట్టి  ఋక్షరజసుడును చూచి ఇంద్రుడు, సూర్యుడు మోహపడగా వారి రేతస్సు స్కలన మయ్యెను. ఇంద్రుని రేతస్సు వాలము నందు పడుటచే వాలియు, సూర్యుని రేతస్సు కంఠము మీద యందు పడుటచే సుగ్రీవుడు జన్మించిరి. బ్రహ్మ జూచి ఋక్షరజసుడుని వేరొక సరస్సులో స్నానము చేయించగా ఋక్షరజసుడు మరల వానరుడయ్యెను. అందుచే సుగ్రీవుడు బ్రహ్మ మనవడు.

No comments:

Post a Comment