Tuesday 4 February 2020

యుద్ధ కాండము-20*

*శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-20*

*రావణుని శక్తిచే లక్ష్మణుడు మూర్ఛ నొందుట*

రావణుడు స్వయముగా గొప్ప సేనతో యుద్ధమునకు వచ్చుట చూచి శ్రీరాముడు విభీషణునితో ఆ వచ్చువారెవరని అడిగెను. అంత విభీషణుడు అందులోని ముఖ్యులైన అకంపనుడు, ఇంద్రజిత్తు, అతిరథుడు, అతికాయుడు, మహోదరుడు, పిశాచుడు, త్రిశిరసుడు, కుంభ నికుంభులు, నరాంతకుడు మొదలగు రాక్షస ప్రముఖులను గురించి చెపుతూ భూతములతో వచ్చుచున్న రుద్రుని వలె వచ్చువాడు రాక్షస రాజైన రావణుడు అని చెప్పెను. రాముడు రావణుని చూడగనే మహాతేజస్సుతో యున్న అతనిని చూచి ఆశ్చర్యము నొంది ఈ నాటికి ఈ పాపాత్ముడు నా కంట పడినాడు కావున నా మనసులో కలిగిన కోపమును వీనిపై చూపెదను అని విల్లు ఎత్తి సంధించి నిలిచెను. అప్పుడు రావణుడు మహాసర్పము వంటి మృత్యుతుల్యమైన ఒక బాణమును సుగ్రీవునిపై ప్రయోగించగా అతను నిలబడెను. వానర ప్రముఖులు పెద్ద పెద్ద పర్వతములతో రాగా వాటిని రావణుడు భగ్నము చేసెను. పెద్ద చేప సముద్రములోకి చొచ్చుకుపోయినట్లు వానర సైన్యము అనెడి సముద్రములోకి రావణుడు ప్రవేశించుచున్నాడు. రావణుని చూచి సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరమును పెళ్ళగించి రావణునిపైకి విసరగా దానిని రావణుడు చిన్నాభిన్నము చేసెను. అప్పుడు రావణుడు ఒక పదునైన బాణముతో సుగ్రీవునిపై వేయగా అది సుగ్రీవుని వేధించెను.సుగ్రీవుడు ఆ బాణపు దెబ్బతో అరచుచు నేలపై బడెను. వెంటనే మిగతా వానర వీరులు రావణునునిపై దండెత్తగా రావణుడు వారిని తమ బాణపు దెబ్బలతో తూట్లు పొడిచెను. వారందరు అప్పుడు రాముని శరణు జొచ్చిరి. శరణన్న వారిని రక్షించుటలో సమర్థుడు, సర్వలోకములకు శరణ్యుడైన శ్రీరాముడు వారికి భయము ఇచ్చెను.  అంత లక్ష్మణుడు రావణునిపై యుద్ధము చేయుటకు అనుమతించవలసినదిగా కోరగా అందుకు రాముడు సమ్మతించెను.  రావణుడు బాణవర్షముతో వానరుల శరీరములను చీల్చుతుండగా హనుమ వాని బాణములను అడ్డుకొని అతనిపై పరుగిడి అరచేతితో ఒక్క దెబ్బ కొట్టెను. కొంతసేపటికి రావణుడు తేరుకొని ...

*అథా౭౭శ్వాస్య మహాతేజా రావణో వాక్యమ౭బ్రవీత్* 6 59 64
*సాధు వానర వీర్యేణ శ్లాఘనీయోఽసి మే రిపుః*

*రావణే నైవ ముక్త స్తు మారుతి ర్వాక్య మ౭బ్రవీత్* 6 59 65
*ధి గ౭స్తు మమ వీర్యేణ య స్త్వం జీవసి రావణ*

 బాగు బాగు. నీవు నాకు సరియైన ప్రతిద్వందివి అనెను. రావణుడిట్లు చెప్పగా హనుమ రావణునితో "రావణా! నీ వింకను జీవించి యున్నావు. కావున నా పరాక్రమమునకు ధిక్కారం" అనగా రావణుడు మెరుపు వేగముతో హనుమ వక్షస్థలముపై మెరుపు వేగముతో మొదగా హనుమ స్పృహ తప్పి పడిపోయెను. అత్తరి నీలుడు ఒకప్పుడు రావణుని ధ్వజము మీదను, ఒకప్పుడు కిరీటము పైనను కూర్చొనియుండుట చూచి శ్రీరామునకు, లక్ష్మణునకు, హనుమకు చాలా ఆశ్చర్యము కలిగెను. రావణునకు కూడా చాలా విస్మయము కలిగెను. రావణుడు అప్పుడు మిగుల క్రోధముతో ఆగ్నేయాస్త్రమును నీలునిపై ప్రయోగించెను. నీలుడు వివశుడై రణరంగమున పడిపోయెను. అయినను తండియైన అగ్ని మహిమాప్రభావము వలన మోకాళ్లపై నిలువరించుకొనెను. పిదప రావణుడు రణోత్సాహముతో లక్ష్మణుని పైకి ఉరికెను. లక్ష్మణుని బాణములచే రావణుని ధనుస్సు విరిగిపోయెను. శరీరముపై దెబ్బలు తగిలి రక్తసిక్తమయ్యెను. అట్టి స్థితి యందు రావణుడు బ్రహ్మదేవుడొసగిన "శక్తి"ని ప్రయోగించెను. ఆ శక్తి ప్రహారముచే విహ్వలుడైన లక్ష్మణుడు భూమిపై పడి పోయెను. వెంటనే రావణుడు వేగముగా వెళ్లి లక్ష్మణుని తన రెండు చేతులతో పైకి ఎత్త దొడగెను.

*తామ్ ఆపతన్తీం భరతా౭నుజోఽస్త్రై:*
*జఘాన బాణై శ్చ హుతా౭గ్ని కల్పైః*
*తథా౭పి సా తస్య వివేశ శక్తి:*
*భుజా౭న్తరం దాశరథే ర్విశాలమ్* 6 59 109

ఏ రావణుడు దేవతలతో కూడిన కూడిన హిమవత్పర్వతమును, మందరాచలమును, మేరుపర్వతమును లేక ముల్లోకములను తన భుజబలముతో లేపగలిగిన శక్తి యుండునో, ఆ రావణుడు లక్ష్మణుని పైకెత్తుటకు సమర్థుడు కాలేక పోయెను. కైలాస పర్వతమును చలింపజేసిన బలశాలి గనుక హిమవత్పర్వతమును కూడా లేపగలడు. మంథర పర్వగతముచే సాగర మథనమును  దేవతలు చేసినారు కావున అట్టి దేవతలను రావణుడు ఓడించాడు గావున మంధర పర్వతము రావణునికి ఒక లెక్కలోనిది కాదు. సకల కుల పర్వతములకు కేంద్రమైనది మేరుపర్వతము. దాని శిఖరమును సముద్రమున నిక్షిప్తము చేసినవాడు వాయుదేవుడు. అట్టి వాయువుదేవుడను తన అధీనములో ఉంచుకొన్నాడు కావున మేరుపర్వతము అతనికి లోకువే. ముల్లోకములు అధిపతియైన దేవేంద్రుని జయించాడు గావున ముల్లోకములు అతనికి అధీనములే. కానీ సమస్త భువన భారములను మోసువాడు ఆదిశేషుడు. లక్ష్మణుడు అట్టి ఆదిశేషుని అవతారము గావున  రావణుడు లక్ష్మణుని ఎత్త లేకపోయినాడు. పాయసం విభాగము చేసినప్పుడు సగభాగము కౌసల్యకు ఇచ్చెను. కావున శ్రీరాముడు విష్ణువు అంశములొ సగ భాగము. అలానే లక్ష్మణుడు చతుర్థ అంశము. అట్టి లక్ష్మణుని కదల్చలేకపోయిన రావణుడు రాముని ఏమి చేయగలడు? కానీ అవివేకము ఆలోచనలను ప్రసరింపజేయనీయదు. సత్యభామ అహంకార రూపమైన ధనమునకు గాక రుక్మిణి భక్తి భావముతో ఒక్క తులసి దళముతో శ్రీకృష్ణుడు తూగినాడు. ఆ సమయమున వాయుపుత్రుడగు హనుమ క్రోధుడై తన పిడికిటిచే రావణుని వక్షస్థలమున గట్టిగా కొట్టెను. దానితో రావణుడు భూమిపై మోకాలు ఆనించి క్రింద పడెను. పిమ్మట హనుమ రావణ పీడితుడగు లక్ష్మణుని రెండు చేతులతో ఎత్తుకొని శ్రీరాముని వద్దకు తీసుకొని వెళ్లెను.

*వాయు సూనోః సుహృత్త్వేన భక్త్యా పరమయా చ సః*
*శత్రూణామ్ అప్రకమ్ప్యోఽపి లఘుత్వ మ౭గమ త్కపేః* 6 59 120

*ఆశ్వస్త శ్చ విశల్య శ్చ లక్ష్మణ శ్శత్రు సూదన:*
*విష్ణోర్భాగ మ౭మీమా౦స్య మా౭౭త్మానం ప్రత్య౭నుస్మరన్*   6 59 122

హనుమంతుని యొక్క సౌహార్థము, అత్యంత భక్తి భావముల వలన లక్ష్మణుడు తేలిక అయ్యెను. అంతట శత్రుసూదనుడైన లక్ష్మణుడు అచించ్యమైన విష్ణువు యొక్క చతుర్థఅంశమైన తనను గూర్చి స్మరించుటతో అతని గాయము లన్నియు తొలగి పోయెను.

*శ్రీరామ జయరామ జయజయ రామ*

No comments:

Post a Comment