Sunday 16 February 2020

యుద్ధ కాండము-31

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-31
లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు హతుడగుట
ఇంద్రజిత్తు విభీషణుని మాటలను విని తీవ్రమైన క్రోథముతో, ప్రళయకాల మృత్యువువలె శత్రువినాశకరమగు బాణములను దాల్చి రథముపై దూకి లక్ష్మణుని ఎదురుగా నిలిచాడు. లక్ష్మణుని మహావేగముగల బాణములతో కొట్టగా, లక్ష్మణుడు పొగలేని అగ్నివలె కనబడెను. లక్ష్మణుడు, ఇంద్రజిత్తుల యుద్ధము ఆకాశములో రెండు గ్రహములు పోరాడుచున్నట్లు యుండెను. కోపగించిన లక్ష్మణుడు ఇంద్రజిఒత్తుపై పామువలె బుసగొట్టు బాణమును ప్రయోగించగా, ఇంద్రజిత్తు మొహము వివర్ణమయ్యెను. ఇది విభీషణుడు గమనించి లక్ష్మణునితో ఇంద్రజిత్తు ఓడిపోవు చిహ్నములు గనబడుతున్నాయి కావున త్వరపడమని చెప్పెను. ఇట్లు అనగానే  లక్ష్మణుడు విషముగల మహాసర్పముల వంటి బాణములను ప్రయోగించగా ఇంద్రజిత్తు ఒక్క క్షణము తెలివి తప్పి మరియొక క్షణములో హనుమ, లక్ష్మణునిపై తీవ్రమైన బాణములు వేసెను. ఈ విధముగా వారిరువురు భీమ పరాక్రమముతో పోరాడుచుండిరి. అప్పుడు విభీషణుడు గమనించి రాముని సేవకునిగా, వానరులకు ఉత్సాహము గల్పించుతూ, రావణునికి ఈ ఇంద్రజిత్తు ఒక్కడే ఆధారము గావున పరాక్రమించమని ప్రోత్సహించుతూ తాను గూడ యుద్ధమునకు దిగెను. విభీషణుడు అట్లు ప్రోత్సహించగా అప్పుడు వానరులకు, రాక్షసులకు మధ్య భీకర పోరు జరిగెను. లక్ష్మణుడు, ఇంద్రజిత్తు మధ్య పోరుతో అంతరిక్షము అంతయు ఆచ్చాదితమయ్యెను. ఆకాశము బాణములతో చీకటి అయ్యెను. రక్తపు నదులు ప్రవహించుచుండెను. లక్ష్మణుడు ఇంద్రజిత్తు యొక్క రథమును గుఱ్ఱములు, సారథితో సహా మట్టుబెట్టెను. ఇంద్రజిత్తులో ఉత్సాహము తగ్గెను. అప్పుడు ఇంద్రజిత్తు క్షణ కాలములో నగరమునకు వెళ్లి మరియొక రథమును, బాణములను తీసుకొని యుద్ధభూమికి వచ్చి వానరులను తీవ్రముగా క్షోభ పెట్టెను. అతని హస్తలాఘవమునకు లక్ష్మణుడు ఎంతయో అచ్చెరు నొందెను. ఇంద్రజిత్తు వరుసగా రౌద్రాస్త్రమును, ఆగ్నేయాస్త్రమును, ప్రయోగించగా లక్ష్మణుడు వారుణాస్త్రమును, మహేశ్వరాస్త్రమును ప్రయోగించెను. అప్పుడు లక్ష్మణుడు శ్రేష్ఠమైన శరమును ధనుస్సు నందు సంధించి అర్థసాధకమగు ఒక వాక్యమును పలికినాడు.
ధర్మాత్మా సత్యసంధ శ్చ రామో దాశరథి ర్యది
పౌరుషే చా౭ప్రతి ద్వన్ద్వ: శరైనం జహి రావణిమ్      6.91.73
"దశరథ పుత్రుడగు రాముడు ధర్మాత్ముడు, సత్యసంధుడు, పౌరుషములో ఎదురులేనివాడు అయినచో, ఓ! బాణమా! నీవు రావణుని పుత్రుని చంపుము" అని బాణమును ఆకర్ణాంతము లాగి ఇంద్రజిత్తుపై వదలినాడు. వెంటనే ఇంద్రజిత్తు యొక్క శిరస్సు నేలబడినది.
లక్ష్మణుడు చెప్పిన ఈ శ్లోకము రామాయణములో ఒక మంత్రము. దీనిని సిద్ధి మంత్రము అందురు. ఈ మంత్రం ప్రభావము వలన ఇంతకు మునుపు వ్యర్థమైన అస్త్రముల వలె గాకుండా వ్యర్థము గాలేదు. దీనితో రాముడు ధర్మాత్ముడని, సత్యసంధుడని, పౌరుషములో ఎదురులేనివాడని ఋజువైనది. చెట్టు చాటు నుండి వాలిని సంహరించిన రాముడు ధర్మాత్ముడా!, పట్టాభిషేకమునకు అంగీకారము తెలిపి వనవాస దీక్ష తీసుకొనుట సత్యసంధతయా!, ఖరునితో యుద్ధము చేయునప్పుడు మూడు అడుగులు వెనుకకు వేయుట  పౌరుషములో ఎదురులేనివాఁడా! అను సందేహములను నివారించినది. అంతియే గాక రాముడు పాయసమునకు పుత్రుడు గాని దశరథునికి పుత్రుడా! అను సందేహమునకు కూడా ఋజువు కనబడినది.
రామాయణము పారాయణము చేయువారు ఈ శ్లోకమును మూల మంత్రముగా జపింతురు. ఏదైనా కార్యములో సిద్ధి కలగ వలెనన్న ఈ శ్లోకమును ధ్యానించినచో, జపించినచో తప్పక కార్యసిద్ధి కలుగునని శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యులవారు సెలవు ఇచ్చిరి. అంతియేగాక ఈ శ్లోకమును జయమంత్రముతో (ఇది సుందర కాండలో యున్నది) కూడి ధ్యానించినచో/జపించినచో అమోఘమైన ఫలితములు  పొందవచ్చు.
ఇంద్రజిత్తు నేలకూలతతో వానరుల ఆనందమునకు అవధులు లేకపోయెను. వారందరు రాముడు ఉన్న ప్రదేశమునకు వచ్చిరి. లక్ష్మణుడు శ్రీరామునికి నమస్కరించెను. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుని శిరస్సును నిండు ప్రేమతో మూర్కొనెను. ఇంద్రజిత్తు మరణించుటతో రాక్షసులందరిని మనము జయించినట్లే. ఈ విధముగా ఆ రామచంద్రప్రభువు తమ్మునకు ఊరట గూర్చి తనవిదీర  హృదయమునకు హత్తుకొనెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment