Tuesday 11 February 2020

యుద్ధ కాండము-26

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-26
 
రావణుని కుమారులు, పినతండ్రులు నిహతులగుట
అనంతరము రావణుని సూచన మేరకు రావణుని కుమారులైన త్రిశరుడు, దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు, రావణుని సోదరులగు మహోదర, మహాపార్శ్వులు రావణునికి నమస్కరించి మృత్యుప్రేరితులై యుద్ధోత్సాహముతో బయలుదేరిరి. ఆయుధపు దెబ్బలు తగిలితే నొప్పి లేకుండా చేసే పదివిధములగు ఓషధులను తమతో ఉంచుకొనిరి.  అప్పుడు జరిగిన యుద్ధమున అంగదుడు నరాంతకుని, హనుమ దేవాంతకుని మరియు త్రిశురుని నీలుడు మహోదరుని, ఋషభుడు మహాపార్శ్వుని సంహరించిరి. ఇంద్రుని అంతటి పరాక్రమవంతులైన తమ సోదరులు (నరాంతకుడు, దేవాంతకుడు, త్రిశురుడు) మరియు తన పైన తండ్రులైన యుద్ధోన్మత్తుడు (మహోదరుడు), నెత్తురు (మహాపార్శ్వుడు) నిహతులైనందుకు అతికాయుడు అమితముగా దుఃఖించెను. కుంభకర్ణుని వంటి శరీర పరిమాణముతో భయంకరమగు వింటి నారి ధ్వనితో వచ్చుచున్న ఆ రాక్షసుడు ఎవరని శ్రీరాముడు విభీషణుని అడిగెను. అప్పుడు విభీషణుడు రామునితో ఆ వచ్చువాడు రావణుని కుమారుడైన అతికాయుడు. రావణునితో సమానుడు. పెద్దలను సేవించి వేద వేదాంగములను, సర్వాస్త్ర విద్యలను పొందినాడు. ఇతను రావణుని ఒక భార్యయైన ధాన్యమాలిని కొడుకు. తపస్సు చేసి బ్రహ్మ వలన అనేకమైన అస్త్రములను, సురాసురులచే మరణము లేకుండా, దివ్యమగు కవచమును, రథమును మొదలగు  వరములు పొందిన వాడు. కావున మన వానర సైన్యములు నశించక ముందే ఇతని విషయమున తీవ్రమగు ప్రయత్నమూ చేయవలెను అని చెప్పెను. ఆ అతికాయుడు రాముని వద్దకు యేగి "నేను సామాన్యులతో యుద్ధము చేయనని, నాతో యుద్ధము చేయగల పట్టుదల గలవారు ఎవరైన ఉన్నచో యుద్ధము చేయుడు" అని అనెను. అప్పుడు లక్ష్మణుడు క్రోధముతో ధనుష్టంకారము చేసి నిలబడెను. అప్పుడు అతికాయుడు తీవ్రమగు కోపముతో శ్రేష్ఠమైన బాణములను లక్ష్మణుడు పై ప్రయోగించెను. వాటినన్నింటిని లక్ష్మణుడు చేధించెను. అనేకమైన తీవ్రమైన బాణములను ప్రయోగించుచున్నను అతికాయుని వజ్రభూతమగు కవచమునకు తగిలి చివరి ముళుకులచే విరిగి నేలబడెను. అప్పుడు వాయుదేవుడు వచ్చి లక్ష్మణునితో "ఈతనికి బ్రహ్మ వరముచే లభించిన అభేద్యమైన కవచము యున్నది. నీ బాణములేమియు చేయజాలవు. ఈ కవచమును బ్రహ్మాస్త్రముచే చేధింపుము. అది తప్ప వేరొకటి ఈతనిని చంపజాలవు". అని చెప్పెను. అప్పుడు లక్ష్మణుడు బ్రహ్మాస్త్రము ప్రయోగించగా అతికాయుడు శిరస్సు తెగి నేలబడెను. అప్పుడు రావణుడు చింతాక్రాంతుడై ..
 
తం మన్యే రాఘవం వీరం నారాయణ మ౭నామయం  6.72.11
తద్భయా ద్ధి పురీ లంకా పిహిత ద్వార తోరణా
 
ఆ రఘువీరుడు సనాతనమైన శ్రీమన్నారాయణునిగా తలఁచెను. ఆ మహాత్ముని భయముచే లంకానగరము యొక్క అంతర్ద్వారములను, బహిర్ద్వారములను అన్నియు మూతబడినవి కనుక లంకానగరము యొక్క రక్షణ వ్యవస్థ మరియు సీత యుండు అశోకవనము జాగ్రత్త అని రావణుడు రాక్షసులకు ఆజ్ఞ యిచ్చెను. అంత ఇంద్రజిత్ తండ్రి యైన రావణుని అనుమతితో యుద్ధమునకు బయిలు దేరెను.

No comments:

Post a Comment