Sunday 2 February 2020

యుద్ధ కాండము-18

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-18
నాగపాశ బంధములోని యోగ రహస్యము
సువేల పర్వతము యొక్క శిఖరము (ఉచ్చ అవస్థ) పై ఆరూఢుడై భగవానుడైన రాముడు మాయారూప లంకను ఏ విధముగా నష్టపరచ వలెనో సంకల్పించుకొనెను. అదృశ్య రూపములో రావణుడి పుత్రుడైన ఇంద్రజిత్ రాముని సేనలో శస్త్ర వర్షమును గురిపించెను. ఏ మంత్రముతో అతడు రాముని సేనపై శస్త్ర వర్షమును గురిపించెను?  “మన నాత్ త్రాయతే ఇతి మంత్రః”  అని మంత్ర పదానికి నిర్వచనం. మననము చేసిన కొలదీ రక్షించే దాన్ని మంత్రం అంటారని దీని అర్ధం. ‘ నిరంతర శ్రవణ, స్మరణ, మననాల వలన ఉపాసకుని రక్షిస్తూ చివరకు ఉపాస్యదేవతా స్వరూపంగా మార్చగలిగే వర్ణ సంపుటాన్ని’ (అక్షరాల కూర్పును) ‘మంత్రం’ అనవచ్చును. ఏ మంత్రమైనా అక్షరాలతోనే రూపొందింపబడుతుంది. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ప్రత్యేకమైన ధ్వని, ఒక్కొక్క ప్రత్యేకమైన అర్థం వుంటాయి. ధ్వని – నాదాత్మకమైతే, అర్థం – జ్ఞానాత్మకం. అమ్మవారు ‘నాదరూపిణీ’ 'జ్ఞాన జ్ఞేయ స్వరూపిణీ’ గూడా కాబట్టి – సర్వమంత్రాలు అమ్మవారి స్వరూపమే అవుతాయి. అంతేకాకుండా మనస్సు నందలి శక్తిని రక్షించునదియే మంత్రము. మనస్సు బలమైనది అయినచో అన్నియు ప్రాప్తించుకొనవచ్చును. "మన ఏవం మనుష్యాణాం కారణం బంధమోక్షయోః" . బంధనము లేదా మోక్షము అనేది మనస్సు యొక్క స్థితిని బట్టి ఉంటుంది." కేవలం శారీరిక యాంత్రిక భక్తి సరిపోదు; మనస్సుని భగవత్ ధ్యాస లో నిమగ్నం చేయాలి. మంత్రం విషయములో రామాయణ కాలము నందు కూడా మూర్ఖమైన కల్పనలు యున్నవి. మంత్ర సిద్ధులు, మోసముతో కూడిన మాయాజాలం అతిధిగా గల కల్పనలతో సమాజము భ్రష్టమయ్యెను. వాస్తవికమైన శారీరక , మానసిక బలము సమాజము నందు ఉత్పన్నమవాలి. దేశములోని మానసిక బానిసత్వము నిర్మూలింపబడి జ్ఞానమయము కావాలి. ఇంద్రియములను సంయమము నందుంచి ఆత్మజ్ఞానము పొందవలెననెడి కోరిక గల ఆధ్యాత్మిక సాధకుడు ఇంద్రజిత్. ఇంద్రియ దమనమము వలన సంయమము నొందిన మనస్సును, ధ్యానము, సమాధులకై ఉపయోగించి ఆత్మజ్ఞానము వైపు పురోగించవలెను. అట్లుగాక ఇంద్రియములను అణచి ఆత్మజ్ఞానము పొందామనుకొన్న సాధకులు తమ అజ్ఞానపు చీకట్లలో చిక్కుకొన్నట్లే. వారు అంధులని చెప్పవచ్చు. తమ దోషములను కండ్ల నుండి, మనస్సు నుండి చూడక అదృశ్యముగా యుంచి తమ అజ్ఞానమయ అవస్థ యొక్క కర్మ రూప బాణములను బ్రహ్మ వైపు గురిపెట్టువాడు అదృశ్యముగా శరవర్షమును కురిపించు ఇంద్రజిత్ వంటి వాడు. సాధక రాముడు తన యందు అంతర్గతమై యున్న ఇంద్రజిత్ మాయాజాలమును పసిగట్టి, ఏ స్థానము నుండి శరవర్షము కురియుచున్నదో నిర్ధారణ చేసి ఆ స్థానంపై తన రామ బాణ వర్షమును పంపించుటలో ఇంద్రజిత్ పరారగును. కానీ ఇంద్రజిత్ బహు మాయావి. రాక్షస వృత్తి రూపమగుట వలన రామలక్ష్మణులను మట్టుబెట్టవలెనని యోచనతో మరియొక శక్తివంతమైన మాయాస్త్రము అనగా నాగాస్త్రమును ప్రయోగించెను. నాగాస్త్ర ప్రభావము వలన రామలక్ష్మణులు బందీలైరి. గరుత్మంతుడు అక్కడకు వచ్చి వారిరివురిని బంధవిముక్తులను చేసెను. నాగపాశమనగా కుండలిని జాగృత్త అవస్థ. నాగపాశమున పుట్టిన విషమువలె కుండలిని జాగృత్త ఆ సమయమున అత్యంత తాపము ఉత్పన్నమగును. కుండలిని జాగృతము తర్వాత సాధకుని శరీరము, మనస్సు శుద్ధమై బలవర్థకమగును. అందుండి సాధకునకు ఉత్కృష్ణ జ్ఞానము ప్రాప్తించును. ఆ అవస్థ నుండి మరింత పురోగతి సాధించుటకై ఉన్నతమైన వాయుతత్వ అవస్థమును పొందాలి. ఈ వాయుతత్వ అవస్థకు చిహ్నము గరుత్మంతుడు. నాగపాశము లేదా సర్పముపై గరుత్మంతుడు విజయం సాధించును.  అదేవిధముగా వాయుతత్వ అవస్థ ప్రాప్తించినచో కుండలిని జాగ్రత్త అవస్తయూ శాంతించును. మరియొక కోణములో గరుత్మంతుడు విష్ణువు యొక్క వాహనము. రాముడు విష్ణు అవతారంగా భావింతురు. పూర్వపు జన్మ వాహనమైన గరుత్మంతుని సహాయము స్వీకరించడమైనది. ఈ విధముగా సాధనా పరంపర అనేక జన్మల కర్మగతి నుండి ఉద్భవించును.
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment