Sunday 2 February 2020

యుద్ధ కాండము-17*

*శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-17*
*లంకపై వానరయోధుల దండయాత్ర, నాగపాశ బంధ విముక్తి*
శ్రీరాముడు, రాక్షసులచే పీడింపబడుతున్న సీతను మరల మరల తలంచుకొనుచు ధర్మాత్ముడగు శ్రీరాముడు శత్రువులగు రాక్షసులను వధించుటకై వానరులకు ఆజ్ఞ ఒసగెను.
*జయ త్య౭తి బలో రామో లక్ష్మణ శ్చ మహా బలః*
*రాజా జయతి సుగ్రీవో రాఘవే ణా౭భి పాలితః* 6 42 20
*ఇత్యేవం ఘోషయన్త శ్చ గర్జన్త శ్చ ప్లవంగమాః*
*అభ్యధావన్త ల౦కాయాః ప్రాకారం కామ రూపిణః* 21
కామరూపులైన ఆ వానరులు తిరుగులేని పరాక్రమశాలియైన శ్రీరామునికి జయము, మిక్కిలి బలవంతుడైన లక్ష్మణునికి జయము. శ్రీరాముని అనుగ్రహమునకు పాత్రుడైన వానర రాజైన సుగ్రీవునికి జయము అని జేజేలు పలుకుతూ, సింహగర్జనలు చేయుచు లంకాపుర ప్రాకారములు మీద విరుచుకు పడిరి. మిక్కిలి బలశాలియైన 'కుముదుడు' పదికోట్ల మంది వానర యోధులతో ఈశాన్య దిశను, 'శతవలి' ఆగ్నేయ దిశను, 'సుషేణుడు' నైరుతి దిశను, సుగ్రీవుడు వాయువ్య దిశను ఆక్రమించిరి. (ఇచ్చట శ్రీరాముడు తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తర ద్వారముల వద్ద ఎవరు ఉండాలని నిర్ధేశించారు. ఇప్పుడు ఆయా కోణములందు (మూలలు) మిగిలిన వీర్యవంతులైన వానరులు వారికి అండగా యున్నారు. అంతియే గాక ఇంద్రజిత్తు లంకా నగరము యొక్క పశ్చిమ ద్వారమును, రావణుడు ఉత్తర ద్వారములను రక్షించుతున్నారు. కావున వారి ఇరువురి దృష్టి వాయువ్యముపై పడును కాన ఈ దిశ యందు దండెత్తు బాధ్యత సుగ్రీవునకు శ్రీరాముడు అప్పచెప్పెను). అప్పుడు జరిగిన వానర, రాక్షసుల సమరం దేవాసుర సమరమును పోలి యున్నది. వారి యుద్ధముచే ఆ ప్రాంతమంతయు రాక్షసుల, వానరుల రక్తమాంసములతో బురదగా యుండెను. ఈ విధముగా వానరులు రాక్షసులతో యుద్ధము చేయుచుండగా ఒకరిపై ఒకరు జయించవలెననెడి పట్టుదల ఎక్కువ అగుచుండెను. వాలిపుత్రుడగు అంగదుడు ఇంద్రజిత్తుతో తలపడెను. ఇంద్రజిత్తు అంగదుని గట్టిగ గదతో మోదగా, అంగదుడు కోపించి వాని రథమును గుఱ్ఱములు సారధితో సహా కూల్చెను. లక్ష్మణుడు విరూపాక్షుని, శ్రీరాముడు అగ్నికేతువు, రష్మికేతువు, సుపతఘ్నుడు, యజ్ఞకోపుడు లను సంహరించిరి. అందుకు ఇంద్రజిత్తు క్రోధముతో రామలక్ష్మణులను నాగాస్త్రముచే బంధించెను. రామలక్ష్మణులు అవతార పురుషులు. వారు మృత్యువుకే మృత్యుదేవతలు. అట్టివారిని ఎవరు బంధింపగలరు? వారు మానవరూపములో యున్నారు గావున బంధితులైనారు. ఇంకను ఇంద్రజిత్తు అనేకమైన పదునైన శరములు శ్రీరామునిపై ప్రయోగించెను. అవి ఏవనగా ..
*రుక్మ పుంఖైః ప్రసన్నాగ్రై రధో గతిభి రా౭౭శుగైః*
*నారచై ర౭ర్ధనారాచై ర్భల్లై ర౦జలికై ర౭పి*
*వివ్యాధ వత్ సదన్తై శ్చ సింహ దంష్ట్రైః క్షురై స్తథా* 6 45 23
నారాచములు (సూటిగా నుండి వర్తులాకారము గలవి), అర్థనారాచములు (మధ్యభాగమున నారాచమువలె యుండునవి), భల్లములు (గండ్రగొడ్డలి వంటి మొనలు కలవి), అంజలికములు (దోసిళ్లవంటి అగ్ర భాగములు గలవి), వత్సదంతములు (దూడల దంతములు వంటి అడుగు భాగములు గలవి), సింహ దంష్ట్రములు (సింహముల కోరల వంటి అగ్రభాగములు గలవి), క్షురములు (కత్తుల వంటి మొనలు గలవి) అను వివిధములగు బాణములచే శ్రీరాముని గాయపరచెను. అంత ఇంద్రజిత్తు సంతోషాతిరేకమున లంకానగరమును ప్రవేశించెను. అంత రావణుడు సంతోషముతో త్రిజట మొదలగు వానర స్త్రీలతో సీతను పుష్పక విమానము ద్వారా యుద్ధభూమికి తీసుకొని వెళ్లి రామలక్ష్మణులను చూపమని ఆజ్ఞాపించెను. సీత రామలక్ష్మణులను చూచి అయ్యో! నన్ను ఇదివరకు ఋషులు, పెద్దలు నీ చేతిలో, కాళ్లలో పద్మ రేఖలున్నాయి కావున నీవు సౌభాగ్యవతివి, మహాసామ్రాజ్యమునకు పట్టమహిషివి, వీరులైన పుత్రులను పొందుదవు అని అన్నారు. కానీ అవి అన్నియు నిష్ప్రయోజనములు అయినవి అని దుఃఖించెను. సీత వారి దేహములను చూచి దుఃఖించగా, త్రిజట సీతను అనునయిస్తూ శ్రీరాముడు జీవించియే యున్నాడు అని చెప్పెను. త్రిజట సీతకు చెపుతూ అమ్మా! నీవు పుష్పక విమానము లో కొనిరాబడినావు అనగా పుష్పకము సౌభాగ్యవతులు కానీ వారు ఎక్కుటకు అనర్హులు కావున నీ పతి జీవించియే యున్నాడు అని గమనించుము. నాగపాశముచే బంధింపబడిన రామలక్ష్మణుల శరీరములు, అంగప్రత్యంగములు బాణములచే నిండియుండుట చూచి సుగ్రీవుడు దీనత్వమును వహించెను. అప్పుడు విభీషణుడు వానర రాజుతో స్వస్థత చెందమని, దుఃఖము పడవలదని చెప్పెను.
*పర్యవస్థాప యా౭౭త్మాన మ౭నాథం మాం చ వానర* 6 46 33
*సత్య ధర్మా౭నురక్తానాం నా౭స్తి మృత్యు కృతం భయమ్*
సత్యముపై విశ్వాసము గల వారికిని, ధర్మనిరతులకు మృత్యు భయముండదు. తన శరీరము యొక్క ధృఢత్వము చేతను, అకుంఠిత శక్తి చేతను శ్రీరాముడు మూర్ఛ నుండి తేరుకొని సోదరుడైన లక్ష్మణుని చూచి దుఃఖించెను. అప్పుడు రెండు ఘడియలలో మహాబలశాలియగు గరుత్మంతుడు అచటికి వచ్చెను. అతని రాకతోనే మహాబలవంతమైన బాణరూపమున యున్న ఆ సర్పరాజములు పారిపోగా రామలక్ష్మణుల గాయములన్నియు సమసి పోయి వారి శరీరములు సుందర కాంతితో ఆరోగ్యవంతములై అలరారెను. గరుత్మంతుడు రామలక్ష్మణులను రోగరహితులను చేసి వారికి ప్రదక్షణ చేసి వాయువేగమున వెడలి పోయెను.
*శ్రీరామ జయరామ జయజయ రామ*

No comments:

Post a Comment