Tuesday 25 February 2020

యుద్ధ కాండము-40

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-40
పతి వియోగమునకు మండోదరి విలపించుట
అచింత్యములగు గొప్ప కర్మల నాచరించు శ్రీరామునిచే చంపబడిన తన భర్తయగు రావణుని చూచి మండోదరి దీనురాలై మహాదుఃఖమును పొంది ఈ ప్రకారముగా విలపింప దొడగెను.
ఇన్ద్రియాణి పురా జిత్వా జితం త్రి భువన౦ త్వయా
స్మరద్భి: ఇవ త ద్వైరమ్ ఇన్ద్రియై: ఏవ నిర్జితః 6.114.18
అవశ్య మేవ లభతే ఫలం పాపస్య కర్మణ:             6.114.25
ఘోరం పర్యాగతే కాలే కర్తా నా౭స్త్య౭త్ర సంశయ:
శుభ కృత్ శుభ మా౭౭ప్నోతి పాప కృత్ పాప మ౭శ్నుతే 6.114.26
విభీషణ స్సుఖం ప్రాప్త స్త్వం ప్రాప్త: పాప మీదృశం
నాథా! మొదట మీరు ఇంద్రియములను జయించియే ముల్లోకములపై విజయమును పొందిరి. ఆ వైరమును జ్ఞప్తియందుంచుకొని ఏమో ఇప్పుడా ఇంద్రియములే మిమ్ములను ఓడించి వేసినవి. మీరు శ్రీరామునితో విరోధము పెట్టుకొనవద్దని ఎన్ని సార్లో చెప్పితిని. కానీ నా మాటలు పెడ చెవిని పెట్టితిరి. దాని ఫలితమే ఈనాడు లభించినది. సమయము  వచ్చినప్పుడు  కర్తకు తన పాపకర్మ యొక్క ఫలము తప్పక లభించును.   శుభకర్మ నొనర్చు వానికి ఉత్తమ ఫలము లభించును. పాపకర్మము చేయువానికి పాపఫలమగు దుఃఖము సంభవించును. విభీషణునకు తన శుభ కర్మల వలననే సుఖము సంప్రాప్తించింది. నీవిట్టి దుఃఖమును అనుభవించ వలసి వచ్చినది. మీ ఇంటి యందు సీత కంటే ఎక్కువ సౌందర్యము గల యువతులెందరో గలరు. కానీ మీరు కామవశులై ఈ విషయమును తెలుసుకొన లేక పోయిరి. మీరు ప్రపంచమును అంతయును క్షోభ పెట్టితిరి. సాదు మహాత్ములను హింసించితిరి. శత్రువుల చెంత బలపూర్వక, అహంకార పూరితములైన మాటలను పలికితిరి. మీరు పెక్కురు కులకాంతులను, గురుసేవాతత్పరులైన స్త్రీలను, ధర్మ పరాయణులైన వారిని విధవలుగా చేసి వారిని అవమానించితిరి.
ప్రవాద: సత్య ఏవా౭యం  త్వాం ప్రతి ప్రాయశో నృప
పతివ్రతానాం నా౭కస్మాత్ పతన్త్య శౄణి భూతలే 6.114.67
మహారాజా! పతివ్రతలు యొక్క కన్నీరు ఈ భూమిపై వ్యర్థముగా పడరాదు. అట్లు పడినచో పెక్కు అనర్థములు సంభవించును అనునది పెద్దల మాట. ఆ జనశ్రుతి నీ విషయమున ఇప్పుడు సత్యమైనది. మీరు మీ యొక్క తేజముచే ముల్లోకములను ఆక్రమించి మిమ్ము మీరు గొప్ప శూరులుగా తలచుకొంటిరి. కానీ ఒక పరాయి స్త్రీని దొంగిలించునంతటి నీచ కార్యమును మీరేల చేసితిరి.
కామ క్రోధ సముత్థేన వ్యసనేన ప్రస౦గినా
నిర్వృత్త స్త్వ త్కృతే౭నర్థ: ౭సోయం మూల హరో మహాన్ 6.114.73
త్వయా కృతమ్ ఇదం సర్వమ్ అనాథం రక్షసాం కులమ్
మారీచ కుంభకర్ణాభ్యాం వాక్యం మమ పితు స్తదా   6.114.78
న శ్రుతం వీరమత్తేన తస్యేదం ఫల మీద్రుశం
కామక్రోధముల వలన ఉత్పన్నమైన దోషముచే ఈ ఐశ్వర్యమంతయు నశించి పోయినది. మరియు సమూలంగా వినాశమొనర్చు ఈ గొప్ప అనర్థము సంప్రాప్తించినది. నేడు సమస్త రాక్షస వంశమును మీరు అనాథమొనర్చితిరి. మీరు మీ బలమును గూర్చిన గర్వముచే మత్తెక్కి యుంటిరి. అందుచే మారీచుడు, కుంభకర్ణుడు, నా తండ్రి చెప్పిన మాటలను సమ్మతించ కుంటిరి. దాని ఫలితమే ఇపుడు మీకు సంభవించినది. ఇట్లు మండోదరి కన్నీరు నిండిన కన్నులతో విలపించి మూర్ఛ నొందెను. అప్పుడామె సవతులిట్లు పలికిరి. మహారాణీ! ప్రపంచము యొక్క స్వరూపము అస్థిరమని మీకు తెలియదా? పరిస్థితి మారినప్పుడు రాజుల సంపద స్థిరముగా యుండదు.
తదుపరి విభీషణునితో గూడ ఇతర రాక్షసులున్ను రావణుని చితిపై వివిధ వస్త్రాలను, పేలాలు ఉంచిరి. అప్పుడు వారి ముఖంపై కన్నీటి ధారలు కారుచుండెను. అప్పుడు విభీషణుడు చితికి యధాప్రకారముగా అగ్ని ముట్టించెను. అయోధ్య కాండలో, సారథి అయిన సుమంత్రునితో, దశరథుడు ఈ విధముగా చెప్పెను.
సుమన్త్రా౭౭నయ మే దారాన్ యే కే చిత్ ఇహ మామకాః
దారైః పరివృతః సర్వై ర్ద్రష్టుమ్ ఇచ్ఛామి ధార్మికం              2.34.10
అర్ధ సప్త శతా స్తా స్తు ప్రమదా: తామ్ర లోచనాః
కౌసల్యాం పరివార్యా౭థ శనై: జగ్ము: ధృత వ్రతాః 2.34.13
సుమంత్రా ఈ భవనమున గల నా భార్యలందరిని తీసుకొని రమ్ము. వారందరితో కూడి నేను రాముని చూడగోరుతున్నాను. అప్పుడు 350 మంది స్త్రీలు నియమనిష్టలతో కౌసల్యను అనుసరించి భవనమునకు చేరిరి.
పై విషయములను బట్టి తెలియునది ఏమనగా దశరథునికి 350 మంది భార్యలు గలరు. అందు ముఖ్యమైన వారు కౌసల్య, కైకేయి, సుమిత్ర. అలాగే రావణునికి కూడా పెక్కు మంది పత్నులు గలరు. కానీ ముఖ్యమైన వారు మండోదరి, ధాన్యమాలిని. రావణునికి మొత్తము ఏడుగురు కొడుకులు. వారు ఇంద్రజిత్తు. అతనినే మేఘనాథుడు అంటారు. ఇతను రావణాసురుని పెద్ద కొడుకు. ఇంకా అతికాయుడు, అక్ష కుమారుడు, దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశిరుడు, ప్రహస్తుడు.  ఇంద్రజిత్తు, అతికాయుడు, ప్రహస్తులను లక్ష్మణుడు సంహరించాడు. అక్ష కుమారుడు, దేవాంతకులను హనుమ సంహరించాడు. నరాంతకుడిని అంగదుడు, త్రిశిరుడ్ని నీలుడు  సంహరించారు. ఇక్కడ గమనించింది ఏమనగా రావణుడు అహంకారి, దుష్ట స్వభావము కలవాడు. అధర్మ పరుడు. వీటి కారణంగానే అతను సంహరింప బడ్డాడు కానీ పరాక్రమము లేక కాదు. అలాగే పరాక్రమము వంతులైనను అతని కొడుకులు గూడ తండ్రి గుణములను కలిగి యున్నారు.  వారు కూడా ఈ కారణంగానే సంహరింప బడ్డారు. ఇంతమంది కొడుకులు గల్గినను తను, తన కొడుకుల అధర్మవర్తన వలన రావణాసురుని ప్రేత సంస్కారము చేయడానికి ఒక్క కొడుకు గూడ మిగిలి లేడు. అతని వంశము మొత్తము సర్వ నాశనము అయ్యినది. అందువలననే విభీషణుడు రావణాసురుని ప్రేత సంస్కారము చేయవలసి వచ్చినది. లోకములో తండ్రి గుణములు కొడుకుకు అబ్బును కావున తండ్రి ధర్మవర్తనతో పిల్లలకు మార్గదర్శనం చేయవలసి యున్నది. ఇదేవిధముగా మహాభారతములో దుర్యోధనుని అహంకారము కారణంగా కౌరవుల వంశము మొత్తము క్షయమైనది. అయితే ఒక సందేహము రావచ్చు. హిరణ్యకశ్యపుడు అధర్మవర్తనుడు అయినను ప్రహ్లాదుడు ఎలా ధర్మపరుడు అయినాడు? ఇక్కడ గమనించితే ప్రహ్లాదుడు గురువుగా నారదుడు ఒసగిన నారాయణ మంత్రము వలన సంస్కరింపబడ్డాడు.
రాముడు సత్యవాది. సత్యవాది యొక్క మాటలు ఎన్నడును హృదా పోవు. యుద్ధము ప్రారంభమునకు ముందు చివరి ప్రయత్నముగా శ్రీరాముడు,  అంగదునితో సంధి  ప్రయత్నము చేసెను. శ్రీరాముడు ఈ విధముగా రావణునికి కబురు పంపెను.  
బ్రవీమి త్వాం హితం వాక్యం క్రియతామ్ ఔర్ధ్వదేకికమ్
సుదృష్టా క్రియతాం ల౦కా జీవితం తే మయి స్థితమ్ 6.41.71
రావాణా! నీ మేలు కొరకై హితవచనములు నుడుపుచున్నాను. రాక్షసులందరు మృతి చెందనున్నారు గావున నీకు పుణ్యలోకములు ప్రాప్తించుకొనుటకై తగిన శ్రాద్ధాది పుణ్య కర్మలను నీ కొరకై నీవే ఆచరించుకొనుము. కడసారిగా లంకను ఒక్కసారి చూచుకొనుము. నీ ఆయువుపట్టు నా చేతిలో యున్నది. చివరికి శ్రీరాముడు వచించినట్లే రావణుడికి శ్రాద్ధము పెట్టుటకు కొడుకులు ఎవ్వరును జీవించి యుండలేదు.
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment