Thursday 13 February 2020

యుద్ధ కాండము-29

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-29

సుగ్రీవుని ఆజ్ఞపై వానరులు లంకను దహించివేయుట
ఆ తరువాత సుగ్రీవుడు హనుమతో కుంభకర్ణుడు చనిపోయినాడు. రావణ సుతులు చాలా మంది చనిపోయినవారు. ఇంక రావణుడు తన పట్టణమును రక్షించుకొను అవకాశము లేదు. కాన మన వానరులు లంకా నగరమును దహించి వేయమని ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు వానరులు ఆ భయంకరమైన రాత్రి యందు జ్వలించుచున్న కాగడాలతో లంక నగరంలోని పురద్వారములను, భవనములను, రాజవీధులను, ఉప వీధులను ఉత్సాహముతో నిప్పు పెట్టగా అవియన్నియు అగ్నికి ఆహుతి అయ్యెను. అగ్నిజ్వాలలచే వ్యాప్తములైన బహిర్ద్వారములు వర్షాకాలమందు విధ్యుత్కాంతులచే చుట్టబడిన మేఘమువలె ఒప్పుచున్నవి. అక్కడ ఉన్న నాగరికులు అందరు హాహాకారములు చేసిరి. అగ్నిచే దహింపబడుచున్న ఆ లంకకు చుట్టునుగల సాగరము తననీటిపై అగ్నిజ్వాలలు నీడలు ప్రతిఫలించుచుండుటచే అది ఒక ఎర్ర సముద్రము వలె కనబడెను. అంతట ఓషదుల ప్రభావము వలన శరీర బాధలు తొలగిన రామలక్ష్మణులు తమ ధనస్సులను చేబూని ధనుష్టంకారము చేయగా రాక్షసులెల్లరు భీతిల్లిరి. రాముని ధనుస్సు నుండి వచ్చిన బాణముల దాటికి కైలాస శిఖరము వంటి లంకానగర గోపురము శిధిలమై క్రిందపడిపోయెను. రాక్షసులకు అది ప్రళయ రాత్రివలె గనిపించెను. సుగ్రీవుని అనుజ్ఞ మేరకు వానరవీరులు కాగడాలు పట్టుకొని రావణుని అంతఃపురమునకు సమీపించిరి. అప్పుడు రావణుడు క్రుద్ధుడై కుంభకర్ణుని పుత్రులైన కుంభ నికుంభులను గొప్ప రాక్షస సేనతో వారికి తోడుగా యూపాక్షుడు, శోణితాక్షుడు, ప్రజంఘుడు, కంపనుడు యుద్ధమునకు బయలుదేరిరి. అప్పుడు జరిగిన యుద్ధము నందు అంగదుడు కంపనుని, శోణితాక్షుని, ప్రజంఘుని; ద్వివిదుడు శోణితాక్షుని; మైందుడు యూపాక్షుని, సుగ్రీవుడు కుంభుని; హనుమ నికుంభుని; శ్రీరాముడు మకరాక్షుని వధించిరి.
ఇంద్రజిత్తు అదృశ్యుడుగా యుండి యుద్ధము చేయుట
అప్పుడు మహాకుపితుడైన రావణుడు, ఇంద్రజిత్తును ఆదేశించుతూ ఇట్లు పలికెను.
 
జహి వీర మహా వీర్యౌ భ్రాతరౌ రామ లక్ష్మణౌ
అదృశ్యో దృశ్యమానో వా సర్వథా త్వం బలా౭ధికః  6.80.3
 
వీరుడా! నీవు శత్రువులకు కనబడచుగాని, కనబడకుండగాని యుద్ధము చేయగల గొప్ప నేర్పరివి. కనుక నీవు మహావీరులైన రామలక్ష్మణులను జయింపుము అని సెప్పి పంపెను. ఇంద్రజిత్తు రాజాజ్ఞను శిరసావహించి యజ్ఞభూమి యందు విధ్యుక్తముగా అగ్నిని వ్రేల్చెను. ఇంతలో ఋత్విక్కులు ధరించుటకై రాక్షస స్త్రీలు ఎర్రని తలపాగాలు తీసుకొని హోమము చేయుచున్న ప్రదేశమునకు వచ్చిరి. పిమ్మట హోమవేదికకు చుట్టును శస్త్రములను, రెల్లుగడ్డి పత్రములను అస్తరణములుగాను, రావిచెట్టు పిల్లలను సమిధలుగాను, ఋత్విక్కులకై ఎర్రని వస్త్రములను, నల్లని ఇనుపస్రువమును యుంచిరి. రెల్లు పరకలతో   గూడిన తోమరములను యజ్ఞవేదికకు నలువైపులా చేర్చిరి. పిదప సజీవంగా యున్న నల్లని మేకను బలి యిచ్చిరి. అప్పుడు పొగలు లేని అగ్నిజ్వాలలు ఒక్కసారిగా పైకి లేచెను. అందుండి అగ్నిదేవుడు స్వయముగా వ్యక్తమై ఆహుతులను స్వయముగా స్వీకరించెను. పిదప అతడు అంతర్థాన శక్తి గలిగిన నాలుగు గుఱ్ఱములు, వాడియైన బాణములు, ధనస్సులతో గూడియున్న రథమును అధిరోహించెను. అట్టి రథముతోను, బ్రహ్మాస్త్రముతోను గూడి, మహాబలశాలియైన ఆ ఇంద్రజిత్తు శత్రువులకు ఎదిరింప శక్యము గాని వాడై యుండెను. అప్పుడు ఇంద్రజిత్తు అక్కడయినా రాక్షసులతో "నేను రామలక్ష్మణులను, సకల వానరులను సంహరించి నా తండ్రియైన రావణునకు యుద్ధ విజయమును చేకూర్చెదను" అని చెప్పి అంతర్ధానమయ్యెను.
 
ఇంద్రజిత్తు రావణునిచే ప్రేరితుడై, మిగుల క్రుద్ధుడై వానరుల మధ్య యున్న రామలక్ష్మణులపై సంతత ధారగా బాణవర్షమును కురిపించెను. ఎవ్వరికిని కనబడకుండ ఇంద్రజిత్తు ప్రయోగించు బాణములకు కోపముతో రామలక్ష్మణులు అతనిపై దివ్యాస్త్రములను ప్రయోగించిరి. మహాబాహువుయైన ఇంద్రజిత్తు మబ్బు మాటున యుండి గురిపించుచున్న బాణవర్షమునకు రామలక్ష్మణులు రక్తసిక్తులయ్యిరి. అంతట లక్ష్మణుడు మిగుల కోపించి బ్రహ్మాస్త్రమును ప్రయోగించుటకు సిద్ధమయ్యెను. అప్పుడు రాముడు లక్ష్మణునితో ...
 
తమ్ ఉవాచ తతో రామో లక్ష్మణం శుభ లక్షణమ్
నైకస్య హేతో రక్షాంసి పృథివ్యాం హన్తు మ౭ర్హసి 6.80.38
 
అయుధ్యమానం ప్రచ్ఛన్నం ప్రా౦జలిం శరణా౭౭గతమ్
పలాయన్తం ప్రమత్తం వా న త్వం హన్తుమ్ ఇహా౭ర్హసి 6.80.39
 
య ద్యేష భూమిం విశతే దివం వా
 రసాతలం వా౭పి నభ స్తలం వా
 ఏవం నిగూఢోఽపి మమా౭స్త్ర దగ్ధః
 పతిష్యతే భూమి తలే గతా౭సుః 6.80.42
 
సోదరా! ఒక్కనికొరకై భూమండలమున యున్న సమస్త రాక్షసులను సంహరించుట సముచితము గాదు. యుద్ధము చేయనివాడు, దాగుకొనిన వాడు, చేతులు జోడించుకొని శరణు పొందినవాడు, యుద్ధమున పారిపోయినవాడు, పిచ్చివాడు - అట్టివారిని చంపరాదు. అప్పుడు రాముడు ఇంద్రజిత్తును మాత్రమే చంపుటకు పూనుకొని లక్ష్మణునితో "ఇతడు భూతలమున ప్రవేశించినను, స్వర్గమునకు ఏగినను, రసాతలమున జొచ్చినను, ఆకాశమందున్నను నా అస్త్రములచే దగ్ధుడై, ప్రాణరహితుడై తప్పక భూమిపై పడిపోగలడు" అని పలికి ఇంద్రజిత్తును చంపుటకు ఉపాయమును ఆలోచించసాగెను.
 
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment