Tuesday 11 February 2020

యుద్ధ కాండము-27

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-27
ఇంద్రజిత్తు యుద్ధ విజృంభణ
 
సూర్యకాంతితో ఆకాశము ప్రకాశించునట్లు ఇంద్రజిత్ యుద్ధభూమిని జేరెను. తన రథము చుట్టూ సైనికులను నిలిపెను. రాక్షస శ్రేష్ఠుడు మంత్రపూర్వకముగా అగ్నిహోత్రములో హోమము చేసెను. హవిస్సులతో, మాలికల్తో, గంథములతో అగ్నిహోత్రుని ఆరాధించెను. శస్త్రములను, రెల్లును అగ్నిహోత్రమునకు చుట్టును అర్పించెను. ఉక్కుతో హోమము చేయు సాధనమును అనగా స్రువమును కల్పించెను. యుద్ధభూమి యందు అగ్ని చుట్టును దర్భలను, చిన్న ఈటెలను పరచి, సజీవంగా యున్న నల్లని మేక యొక్క కంఠమును పట్టుకొనెను. పిదప దానిని అగ్నికి ఆహుతి ఇచ్చెను. అప్పుడు పొగలేని అగ్నిజ్వాలలు ఒక్కసారిగా ప్రజ్వలించినవి. అందు విజయ సూచకమైన చిహ్నములు గోచరించినవి. అంతట అగ్నిదేవుడు మేలిమి బంగారు ఆభరణములను ధరించి ప్రదక్షణ పూర్వకముగా తిరుగుచున్న జ్వాలలు గలవాడై స్వయముగా వచ్చి ఆ ఆహుతిని (హోమద్రవ్యమును) స్వీకరించెను. తదుపరి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రమును ఆవాహనమొనర్చి, తనధనస్సును, రథమును అచట ఉంచి, బ్రహ్మాస్త్ర మంత్రములచే వాటిని అభిమంత్రించెను. ఆ రావణ సుతుడు అగ్నికి హవిస్సులను సమర్పించుచు, బ్రహ్మాస్త్రమును ఆహ్వానించుచున్నప్పుడు సూర్యచంద్రులు, నక్షత్రములు, అంతరిక్షమున గల ఇతర ప్రాణులు భీతికి లోనయ్యెను. అగ్నివలె తేజోమూర్తియు, మహేంద్రుని వలె మిక్కిలి ప్రభావశాలియు, అద్భుతమైన మంత్రశక్తి గలవాడును ఐన ఇంద్రజిత్తు తన అగ్నికార్యములు (హోమములు) పూర్తియైన పిమ్మట ధనుర్భాణములతో, ఖడ్గములతో రథాశ్వములతో, సారథితో సహా కూడి ఆకాశమునకు ఎగిరి అంతర్ధానమయ్యెను.  అప్పుడు జరిగిన మహాసంగ్రామములో ఇంద్రజిత్తు బాణపు దెబ్బలచే అనేకమైన వానరులు నెలకొరిగిరి. కాలాగ్ని వలె వానరులందరూ దహించుచుండిరి. వానర సైన్యమంతయు బాణములచే మూర్ఛ నొందెను. రక్తము స్రవించు చుండెను. సైన్యము వ్యాకులము నొందెను. ఇది చూసి ఇంద్రజిత్తు ప్రీతీ నొందెను. అప్పుడు ఇంద్రజిత్తు తన సైన్యమును వదలి తాను ఎవ్వరికి కనబడకుండా తీవ్రమగు కారుమబ్బు జలధారలు వర్షించునట్లు బాణవర్షమును వర్షించు చుండెను. ఆ బాణవర్షముచే రామలక్ష్మణులను సైతము చీకాకు పరచెను. రాముడు మహాశక్తి  కలవాడయ్యు  ఇంద్రజిత్తు వర్షించుచున్న బాణములను చూచి లక్ష్మణునితో "లక్ష్మణా! యీతడు బ్రహ్మాస్త్రముచే మన సైన్యము నంతయు పడగొట్టి మనలను కూడా చీకాకు పరచుచున్నాడు. బ్రహ్మ ఒసగిన వరముచే మనకు కనబడకుండా ఆకాశమున సంచరించుచున్నాడు. కావున ధైర్యముతో ఓరిమి వహించుము". అనెను. ఇంద్రజిత్తు హర్షముతో రామలక్ష్మణులతో సహా వానర వీరులందరు నేలపై పడి యుండుట చూచి విజయగర్వంతో లంకలో ప్రవేశించెను. ఈ విధముగా ..
 
సప్త షష్టి ర్హతాః కోట్యో వానరాణాం తరస్వినామ్
అహ్నః ప౦చమ శేషేణ వల్లభేన స్వయమ్భువః  6.74.12
 
ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్ర ప్రభావముచే మిగుల బలపరాక్రమవంతులైన వానరులు అరువదియేడు కోట్ల మంది ఆ సాయంకాలమున హతులైరి. భీతిని కొల్పుచున్న వానర సైన్యమును చూచి హనుమంతుడు, విభీషణుడు జాంబవంతుని వెతకసాగిరి. వయోవృద్ధుడు, బ్రహ్మదేవుని సుతుడు అయిన జాంబవంతుడు బాణములచే గాయపడి యుండుట చూచిరి. వారు జాంబవంతునితో నీ ప్రాణములకు ముప్పు వాటిల్లలేదుగదా అని అడిగిరి. అప్పుడు జాంబవంతుడు విభీషణునితో …..
 
అ౦జనా సుప్రజా యేన మాతరిశ్వా చ నైరృతా
హనూమాన్ వానర శ్రేష్ఠః ప్రాణాన్ ధారయతే క్వచిత్ 6.74.18
 
శ్రుత్వా జామ్బవతో వాక్యమ్ ఉవా చేదం విభీషణః
  ఆర్య పుత్రా వ౭తిక్రమ్య కస్మాత్ పృచ్ఛసి మారుతిమ్  6.74.19
 
 నైవ రాజని సుగ్రీవే నా౭౦గదే నా౭పి రాఘవే
 ఆర్య సందర్శితః స్నేహ: యథా వాయు సుతే పరః 6.74.20

 విభీషణ వచః శ్రుత్వా జామ్బవాన్ వాక్యమ్ అబ్రవీత్
 శృణు నైరృత శార్దూల యస్మాత్ పృచ్ఛామి మారుతిమ్   6.74.21
 
 తస్మిన్ జీవతి వీరే తు హత మ౭ప్య౭హతం బలమ్
 హనూమ త్యుజ్ఝిత ప్రాణే జీవన్తోఽపి వయం హతాః            6.74.22
 
 ధరతే మారుతి స్తాత మారుత ప్రతిమో యది
 వైశ్వానర సమో వీర్యే జీవితా౭౭శా తతో భవేత్                6.74.23
 
అంజనాపుత్రుడు, వానరోత్తముడైన హనుమ క్షేమముగా యున్నాడా! అని అడిగెను. అందుకు విభీషణుడు జాంబవంతునితో, రామలక్ష్మణుల క్షేమ సమాచారం గాకుండా హనుమ క్షేమము అడిగావు కారణమేమని అడిగెను. అందుకు జాంబవంతుడు హనుమ జీవించి యున్నచో వానర సైన్యము చచ్చినను, బ్రతికి యున్నట్లే, ఆ మారుతి ప్రాణములను విడిచినచో మనమందరము బ్రతికి యున్నను చచ్చిన వారితో సమానమే. పిదప వాయుసుతుడైన హనుమ జాంబవంతునికి ప్రణమిల్లెను.



No comments:

Post a Comment