Wednesday 12 February 2020

యుద్ధ కాండము-28

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-28

హనుమ సంజీవని పర్వతమును తీసుకొని వచ్చుట
జాంబవంతుడు హనుమతో "కపివరా! ఈ వానరులను కాపాడుటకు నీవే సమర్థుడవు. కావున ముందునకు వచ్చి కటిబద్ధుడవు కమ్ము. పరాక్రమించుటకు నేవే సమర్థుడవు, ఇదియే తగిన సమయము. వ్యధకు గురియైన ఈ రామలక్ష్మణులకు గ్రుచ్చుకొన్న బాణములను తొలగింపుము. నీవు వెంటనే సముద్రము మీదుగా అంతరిక్షమున పయనించి హిమవత్పర్వతమునకు వెళ్లుము. అక్కడ ..
 
తతః కా౦చన మ౭త్యుచ్ఛమ్ ఋషభం పర్వతోత్తమమ్
కైలాస శిఖరం చా౭పి ద్రక్ష్య స్య౭రినిషూదన           6.74.30
 
తయోః శిఖరయో ర్మధ్యే ప్రదీప్త మ౭తుల ప్రభమ్
సర్వౌషధి యుతం వీర ద్రక్ష్యసి ఔషధి పర్వతమ్  6.74.31
 
తస్య వానర శార్దూల చతస్రో మూర్ధ్ని సంభవాః
ద్రక్ష్య స్యోషధయో దీప్తా దీపయన్త్యో దిశో దశ 6.74.32
 
మృత సంజీవనీం చైవ విశల్య కరణీమ్ అపి
సావర్ణ్య కరణీం చైవ సంధాన కరణీ౦ తథా 6.74.33
 
తాః సర్వా హనుమన్ గృహ్య క్షిప్ర మా౭౭ గన్తు మ౭ర్హసి
ఆశ్వాసయ హరీన్ ప్రాణై ర్యోజ్య గన్ధవహా౭౭త్మజ 6.74.34
 
హనుమా! హిమాలయ పర్వతములపై నీకు స్వర్ణమయమై, అత్యున్నమైన "వృషభగిరి" అను ఒక మహాపర్వతము, కైలాస శిఖరము కనబడును. ఆ వృషభగిరికిని కైలాస శిఖరమునకు మధ్య సాటిలేని తేజస్సుతో చక్కగా వెలుగొందు చుండెడి "ఓషది పర్వతము" కనబడును. అది వివిధములగు ఓషదులకు నిలయము. ఆ శిఖరంపై దివ్యములైన నాలుగు ఓషదులు నీకు గోచరించును. అవి దివ్య కాంతులతో దశ దిశలను ప్రకాశింప చేయుచుండును. మృతసంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సావర్ణ్యకరణి అను నాలుగు మహౌషదులను[1] తీసుకొని శీఘ్రముగా మరలి రమ్ము.  ఆ ఓషదుల ప్రభావంతో వానరులను సజీవులను గావించి వారికి స్వస్థత గూర్పుము. అప్పుడు హనుమ జాంబవంతుని మాటలను విన్నంతనే రెట్టించిన పరాక్రమముతో, శ్రీరాముని ధ్యానము చేసి, ఆకాశ గమనమునకు వీలుగా ప్రాణవాయువును నిరోధించి,  త్రికూట పర్వతము నుంచి ప్రచండ వేగముతో మింటికి ఎగిరెను. అప్పుడు ఆ కపివీరుని వేగమునకు వృక్ష సమూహములు, గిరిశిఖరములు, మహాపాషాణములు, త్రికూట పర్వతముపై స్థిర నివాసమున్న వానరములు పైకి ఎగిరి కొంత తడవు పిమ్మట బలహీన పడి సముద్రములో పడిపోయినవి. ఈ విధముగా హనుమ ఆకాశమార్గమున/అంతరిక్షము పయనించి హిమవత్పర్వతమును గాంచెను.  ఆ పర్వత ప్రదేశమున బ్రహ్మ నివాస స్థానము, కైలాసము, ఇంద్రుడు నివశించు ప్రదేశము, శివుడు విలాసముగా తన శరములను ప్రయోగించెడి భూమి, హయగ్రీవుడు ఆరాధించెడి స్థానము, ఈశ్వరునిచే ఖండితమైన బ్రహ్మ శిరస్సు పడిన చోటు, యమకింకరులు అప్పుడప్పుడు విశ్రాంతిగైకొనెడి ప్రదేశము, బ్రహ్మ ఇంద్రునకు వజ్రాయుధమును అనుగ్రహించిన ప్రదేశము, కుబేరుని నిలయము, సూర్యుని భార్య యగు ఛాయాదేవి[2] ప్రీతి కొరకు సూర్యకాంతిని తగ్గించుటకై విశ్వకర్మ భాస్కరుని బంధించిన ప్రదేశము, దేవతలకు దర్శనము కొరకై బ్రహ్మ ఆసీనుడగు ప్రదేశము, శంకరుడు తన ధనస్సును నిలిపెడు చోటు, పాతాళమును ప్రవేశించు ప్రదేశము మున్నగు విశిష్ట స్థానములను ఆ మారుతి దర్శించెను. జాంబవంతుని సూచన ప్రకారము సర్వఔషధ పర్వతమును మారుతి గాంచెను. అతడు ఆ పర్వతమునకు ప్రదక్షణమొనర్చి తనకు అవసరమగు ఓషదులకొరకై అన్వేషింప సాగెను. అప్పుడు ఆ దివ్య ఔషదములు తమను తీసుకొనిపోవుటకు ఎవరో వచ్చినారని గ్రహించి అదృశ్యమాయెను. అప్పుడు హనుమ ఆ ఓషదులు శ్రీరామునికి వారు చేయుచున్న అనాదరణకు క్రుద్ధుడై ఆ పర్వతమును పెకిలించి, చేబూని, ఆకాశమునకు ఎగిరెను. ప్రచండ వేగముతో ఆ పర్వతమును గైకొని త్రికూట పర్వతమునగల వానర సైన్యము మధ్య దిగెను.  ఆ ఓషదుల ప్రభావమున రామలక్ష్మణులకు తగిలిన గాయములు మటుమాయముగాగా ఎప్పటివలె తేజోమూర్తులైరి. పిమ్మట వానరులు గూడ స్వస్థత చేకూరి పునర్జీవితులై, గాయములు తొలగి, ఆరోగ్యవంతులైరి. వానర రాక్షస వీరుల మధ్య నేటి వరకు జరిగిన యుద్ధములో మృతులైన రాక్షసులను, రావణుని ఆజ్ఞ మేరకు ఆయన గౌరవము నిలుపుటకై సముద్రమున పడవేసిరి. అందువలన మృతులైన రాక్షసులు ఎవరును పునర్జీవితులు కాలేదు. తరువాత మారుతి ఆ ఓషధీశైలమును శీఘ్రముగా హిమవత్పర్వతమునకు చేర్చి మరుక్షణమే శ్రీరాముని వద్దకు వచ్చెను.
శ్రీరామ జయరామ జయజయ రామ
[1]
"మృతం సంజీవయతి ఇతి మృతసంజీవనీ":  మృతి చెందిన వారిని బ్రతికించునది.
"జీవనానంతరం సంచారక్షమాతాయై విశల్యం కరోతి - ఇతి విశల్యకరణీ": ప్రాణములు వచ్చిన పిమ్మట అటునిటు సంచరించుటకు వీలుగా బాధలను తొలగించునది.
"విశల్యేకృతే  త్వచస్సంధానం కరోతి ఇతి సంధానకరణి": గాయములు మానినంతనే చర్మమును యథాస్థికి తెచ్చునది.
"తథోవ్రణ కృత వైవర్ణం విహాయ ప్రదేశాంతర సావర్ణ్యం కరోతి ఇతి సావర్ణ్యకరణి": గాయములు మానిన చోట్ల ఏర్పడిన మచ్చలను రూపుమాపి, యథాప్రకారముగా శరీరమును (చర్మమును) శోభిల్ల చేయునది.
[2] ఉష, పద్మిని, ఛాయ, సంజ్ఞ అను నలుగురును సూర్యుని భార్యలు. ఛాయ యొక్క కుమారుడు శని. సంజ్ఞ యొక్క కుమారుడు  

No comments:

Post a Comment