Tuesday 4 February 2020

*శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-19*
*రాక్షస వీరులలోని ముఖ్యులు మరణించుట*
నాగాస్త్రబంధము రామలక్ష్మణులకు విడిపోయినదనే ఆనందముతో వానరులు గర్జించిన ధ్వని రావణుడు వినెను. నాగాస్త్ర బంధనము విడిపోయినదని తెలుసుకొన్నాడు. తరువాత జరిగిన యుద్ధములో లక్ష్మణునిచే విరూపాక్షుడు, శ్రీరామునిచే అగ్నికేతువు, రష్మికేతువు, సుప్తఘ్నుడు, యజ్ఞకోపుడు, హనుమచే ధూమ్రాక్షుడు, అకంపనుడు, అంగదునిచే వజ్రదంష్ట్రుడు వధింపబడిరి.  అప్పుడు లంకాపురము నలువైపులా శత్రుసైన్యము చుట్టుముట్టెను. అది చూచి రాక్షసరాజగు రావణుడు తన హితైషియు, యుద్ధ కళాకోవిదుడు అగు ప్రహస్తునితో శీఘ్రమే సైన్యమును తీసుకొని వెళ్లి విజయమునకు బయిలుదేరుమని చెప్పెను. అప్పుడు సేనాపతియగు ప్రహస్తుడు శుక్రాచార్యుడు అసుర రాజగు బలికి సలహా ఇచ్చినట్లు రావణునికి తన అభిప్రాయము ఇట్లు తెలియ జేసెను.
*రాజన్ మన్త్రిత పూర్వం నః కుశలైః సహ మన్త్రిభిః*   6 57 13
*వివాద శ్చా౭పి నో వృత్తః సమ౭వేక్ష్య పరస్పరమ్*
*ప్రదానేన తు సీతాయాః శ్రేయో వ్యవసితం మయా*    6 57 14
*అప్రదానే పున ర్యుద్ధం దృష్ట మేతత్ తథైవ నః*
రాజా! ఇదివరలో ఈ విషయము గూర్చి మంత్రిమండలిలో చర్చించి యుంటిమి కానీ భేదాభిప్రాయములు తలయెత్తినవి.సీతను తిరిగి రామునకు ఇచ్చివేయుటచేతనే మనకు శ్రేయస్సు కలుగుననియు, ఇవ్వనిచో యుద్ధము తప్పక జరుగుననియు నాకు మొదట నుండి నిశ్చితాభిప్రాయము కలదు. ఆ అభిప్రాయము ప్రకారమే ఇప్పుడు యుద్ధరూప సంకటము ప్రాప్తించింది. కానీ ఇంతకుముందు ప్రహస్తుడు పదునాలుగవ సర్గలో ఈ విధముగా తెలియ జేసినాడు.
*నిశమ్య వాక్యం తు విభీషణస్య*
*తత: ప్రహస్తో వచనం బభాషే*
*న నో భయం విద్మ న దైవతేభ్యో*
*న దానవేభ్యో ప్య౭థ తవా కుతశ్చిత్*
*న యక్ష గ౦ధర్వ మహోరగేభ్యో*
*భయం న సంఖ్యే పతగోత్తమేభ్య:*
*కథం ను రామా ద్భవితా భయం నో*
*నరేంద్ర పుత్రా త్సమరే కదాచిత్*        
దేవతల వలన గాని, దానవుల నుండి గాని, యక్ష, గంధర్వుల నుండి గాని, గరుత్మంతుడు మొదలగు పక్షీంద్రముల వలన గాని మనకు ఎట్టి భయములేదు అట్టిచో ఒక మానవమాత్రుడైన శ్రీరాముని వలన భయమెందుకు?
సత్యము ఎల్లప్పుడూ ఒకే విధముగా యుండును. దేశకాల పరిస్థితులను బట్టి మారదు. కానీ ఇచ్చట ప్రహస్తుడు సమయానుకూలంగా చెపుతున్నాడు. అటువంటి వారి యెడల రాజు కడు జాగరూకతతో యుండవలెను. కానీ రావణుడు అహంకారి, మూర్ఖుడు.
రావణాజ్ఞచే ప్రహస్తుడు యుద్ధమునకు వెడలగా భయంకర వేగశాలి యగు మహాకపి యైన నీలుడు ప్రహస్తుని సంహరించెను. ప్రహస్తుని మరణవార్త విని రావణుడు శోకముతో వ్యాకులమై తానే యుద్ధభూమికి వెడలెను.
*శ్రీరామ జయరామ జయజయ రామ*

No comments:

Post a Comment