Friday 28 February 2020

యుద్ధ కాండము-43

: శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-43
సీత అగ్ని ప్రవేశము

రామాజ్ఞతో, విభీషణుడు వేగముగా అంతఃపురమునకు వెళ్లి తమ స్త్రీలతో అశోకవనమునకు యేగి సీతకు స్నానాది కార్యములు చేయించి దివ్యాభరణములతో అలంకరించి, పల్లకి యందు సీతమ్మను గూర్చుండ జేసి వేగముగా శ్రీరామ సన్నిధికి తోడ్కొని రావలసినదిగా ఆజ్ఞాపించగా వారు అట్లే చేసిరి. అప్పుడు రాముడు ధ్యానమందుండెను. అది తెలిసియు విభీషణుడు వారి యొద్దకు వెళ్లి నమస్కరించి సీతాదేవి వచ్చినదియని తెలిపెను. రావణ భవనంలో సీత ఒక సంవత్సరము ఉన్నదని రామునకు హర్షము, దైన్యము, రోషము కలిగెను. బంధము వీడి నందుకు హర్షము, రావణుని చెరలో దుఃఖముతో ఉన్నందుకు దైన్యము, ఆమెను తిరస్కరించబోవుతున్నందుకు రోషము వచ్చెను. విభీషణుడు సీత వచ్చుచున్నదని త్రోవలో ఎవరు ఉండరాదని ఆజ్ఞాపించగా, శ్రీరాముడు విభీషణునితో ఇట్లు పలికెను.

న గృహాణి న వస్త్రాణి న ప్రాకారా స్తిరస్క్రియాః
నేదృశా రాజ సత్కారా వృత్తమ్ ఆవరణం స్త్రియాః  6.117.26

విభీషణా! ఇల్లు, వస్త్రములు, ప్రాకారములు మున్నగునవి గాని, జనులకు దూరముగా పంపివేయుటకు గాని, ఇట్టి రాజ సత్కారములు స్త్రీకి ఆచ్చాదనమును కలుగ జేయవు. ఆమె సదాచారమే ఆమెకు ఆచ్చాదము. కావున సీత పల్లకి విడిచి నా యొద్దకు వచ్చుగాక. తదుపరి సీత వినయపూర్వకముగా తన సమీపమున నిలబడి యుండుట జూచి, ఆమెతో శ్రీరాముడు తన అభిప్రాయమును ఈ విధముగా చెప్పెను. "నీవు ఆశ్రమమున ఒంటరిగా యున్నప్పుడు రాక్షసుడు నిన్ను తీసుకొని పోయెను. ఆ దోషము నాకు దైవ వశమున సంప్రాప్తించినది. దానిని నేను మానవ సాధ్యమగు ప్రయత్నముచే తొలగించుకొంటిని. శత్రు హస్తమున పడిన నిన్ను చూచి ఓర్వలేక ఆనాడు తపఃశ్శాలి అయి ఆత్మదర్శనము చేసిన అగస్త్యుడు దక్షిణ దిక్కును పొందినట్లు నిన్ను పొందితిని.

సంప్రాప్తమ్ అవమానం య స్తేజసా న ప్రమార్జతి
క స్తస్య పురుషా౭ర్థోఽస్తి పురుష స్యా౭ల్ప తేజసః 6.118.6

ఎవడు సంప్రాప్తించిన అవమానమును తన తేజస్సు చేతను, బలము చేతను తొలగించుకోలేడో, మందబుద్ధియగు అట్టి వానికి గొప్ప పురుషార్థముల వలన ఏమి లాభము? శ్రీరామునికి హృదయములో సీతమ్మ మీద ఎటువంటి సందేహము లేకున్నను, లోకము దృష్టిలో ఎటువంటి అనుమానమునకు తావీయరాదు అని ఆలోచన చేసెను. లోకోపవాదము అనునది ఆయన దృష్టిలో కంటి జబ్బు వలె ఏర్పడినది. కంటికి దీపమును చూడగలిగిన శక్తి యున్నను, జబ్బు గల కన్ను దీపమును ఎలా చూడలేదో అట్లే రాజు కాబోవు రాముని దృష్టికి ప్రజాపవాదమను జబ్బు ఏర్పడినది. ఇంకను రాముడు సీతతో -- ఇప్పుడు నీ చరిత్ర యందు సందేహమునకు అవసరమేర్పడినది. ఆ వాక్యములను విని సీత కన్నీటిచే తడిచిన ముఖమును వస్త్రముచే తుడుచుకొనుచు మెల్లమెల్లగా గద్గద స్వరముతో పతిదేవునితో ఇట్లు పలికెను. 

న తథా౭స్మి మహా బాహో యథా త్వమ్ అవగచ్ఛసి
ప్రత్యయం గచ్ఛ మే యేన చారిత్రే ణైవ తే శపే 6.119.6

మహాబాహు! ఇపుడు మీరు నన్నెట్లు ఊహ చేయుచున్నారో అట్టి దానను నేను కాదు. నన్ను విశ్వసింపుడు. నేను నా సదాచారముపై ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. నేను సందేహింప దానిని కాదు. ఇట్లు చెప్పుచుండ సీత యొక్క కంఠము నిరుద్ద మయ్యెను. ఆమె ఏడ్చుచు, కన్నీరు కార్చుచు, దుఃఖపూరితయై, చింతానిమగ్నయై అచట యున్న లక్ష్మణునితో గద్గద స్వరముతో ఇట్లు పలికెను. "సుమిత్రా నందనా! నా కొరకు చితిని తయారు చేయుము. నా ఈ దుఃఖమునకు ఇదియే మందు. మిధ్యా కళంకితయై నేను జీవించ దలచి లేదు. లక్ష్మణుడు, రాముని మనసును గ్రహించి చితిని సిద్ధము చేసెను. తదుపరి సీత రామునికి ప్రదక్షిణము చేసి ప్రజ్వరిల్లుచున్న అగ్నిహోత్రము వద్దకు చేరెను.

ప్రణమ్య దేవతాభ్య శ్చ బ్రాహ్మణేభ్య శ్చ మైథిలీ
బద్ధా౭౦జలిపుటా చేదమ్ ఉవాచా౭గ్నిసమీపతః     6.119.23

యథా మే హృదయం నిత్యం నా౭పసర్పతి రాఘవాత్
తథా లోకస్య సాక్షీ మాం సర్వతః పాతు పావకః        6.119.24

కర్మణా మనసా వాచా యథా నాతి చరామ్య౭హం
రాఘవం సర్వ ధర్మజ్ఞం యథా మాం పాతు పావక:   6.119.26

ఆదిత్యో  భగవాన్ వాయు: దిశ శ్చంద్ర స్తథైవ చ
అహ శ్చా౭పి తథా సంధ్యే రాత్రి శ్చ పృథివీ తథా     6.119.27

యథా౭న్యే౭పి విజానంతి తథా చారిత్ర సంయుతామ్
ఏవ ముక్త్వా తు వైదేహీ పరిక్రమ్య హుతాశనమ్        6.119.28

సీత, దేవతలకు, బ్రాహ్మణులకు నమస్కరించి చేతులు జోడించుకొని అగ్నిదేవుని సమీపాన ఈ విధముగా చెప్పెను. "నా హృదయము ఒక్క క్షణమైనను శ్రీరాముని నుండి దూరముగా లేనిచో, సమస్త జగత్తుకు సాక్షియగు అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక! కర్మచేతను, వాక్కు చేతను, మనస్సు చేతను, సర్వ ధర్మజ్ఞుడగు శ్రీరామునికి నేను అతిక్రమించనిచో అగ్నిదేవుడు నన్ను రక్షింసీబు గాక! భగవంతుడగు సూర్యుడు, వాయువు, దిక్కులు, చంద్రుడు, పగలు, రాత్రి, సంధ్యలు, భూదేవి, ఇతర దేవతలు నన్ను శుద్ధ చరిత్రతో గూడిన దానినిగా ఎరింగినచో అగ్నిదేవుడు నన్ను రక్షించు గాక!

ఈ ప్రకారముగా చెప్పి సీత అగ్నిదేవునకు ప్రదక్షిణము సెల్ఫీ నిశ్శంకతో గూడిన హృదయముతో ఆ ప్రజ్వలితాగ్ని యందు ప్రవేశించెను.  ఆ సమయమున విశ్రవసుని పుత్రుడగు కుబేరుడు, పితరులతో కూడి యమధర్మరాజు, దేవతల ప్రభువగు ఇంద్రుడు, జలాధిపతియగు వరుణుడు, త్రినేత్రధారియైన పరమశివుడు, బ్రహ్మదేవుడు మొదలగువారు వారివారి వాహనములతో లంకానగరమునకు వచ్చిరి. రాముడు ఏమియు ఎరుగని వానివలె చేతులు జోడించి నిలిచి యుండెను. వారు శ్రీరామునితో - "రామా! నీవు సర్వలోక సృష్టికర్తవు. సర్వజ్ఞుడవు. సీత అగ్నిహోత్రములో పడుట చూచి ఉపేక్షించుట తగునా! మీరు సమస్త దేవతల యందు శ్రేష్ఠుడవగు 'విష్ణువు'. ఈ విషయమును మీరు ఎలా తెలుసుకొనుట లేదు?"
శ్రీరామ జయరామ జయజయ రామ
Only admins can send messages

No comments:

Post a Comment