Sunday 16 February 2020

యుద్ధ కాండము-32

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-32
లక్ష్మణుని తత్వజ్ఞానము
లక్ష్మణుడు ఇంద్రజిత్తు కొరకై శోధన చేసెను. ఇంద్రజిత్తు యుద్ధభూమి నుండి వెడలి తన శక్తిని మరింత ఇనుమడింప ప్రయత్నము చేయుచుండెను. ఇంద్రజిత్తు పన్నాగముతో ఒక మాయాసీతను సృష్టించి హనుమ ముందు సంహరించెను. తల్లియైన సీత మీద ఉన్న అనన్య భక్తి వలన మహా జ్ఞాని అయి యుండియు హనుమ ఆ మాయను గ్రహించలేక దుఃఖ పడి ఆ విషయము ఎరిగించుటకు రామలక్ష్మణుల చెంతకు వెడలెను. మాయను జయించుట కష్టము అనుటకు ఇది ఒక ఉదాహరణ. హనుమ జ్ఞానముపై ఉన్న విశ్వాసముతో రాముడు ఆ మాటను నమ్మెను. దుఃఖముతో ఉండిపోయెను. లక్ష్మణునికి కూడా పీడ కలిగినను తత్వము చెప్పుట ఆరంభించెను. పాపమునకు భయపడి ఇతరులకెవ్వరికి దుఃఖమును కలుగజేయక తమ జీవనమును నడిపించుకొను వ్యక్తులకు అన్ని విధముల కష్టములు కలుగుట, సమాజము నందు గౌరవనీయమైన వ్యక్తులు కూడా అటువంటి వారిపై అన్యాయము చేయుట కద్దు. ఈ విషయములను గురించి విచారించని మరికొంతమంది పాపములను చేయుచు, సమాజమునందు పెద్దలవలె గౌరవింపబడటం కూడా కద్దు. రాముని నిరంతర దుఃఖమును చూచి లక్ష్మణుడు పై విధమైన తత్వ జ్ఞానముతో చెప్పుచుండెను. ఇటువంటి పలుకులే అంతరమున పాపభీతితో డాంబికముగా  నున్న ఈనాటి వ్యక్తులు చెప్పుట చూచెదము.
తం లక్ష్మణోఽథ బాహుభ్యాం పరిష్వజ్య సుదుఃఖితః
ఉవాచ రామమ్ అస్వస్థం వాక్యం హేత్వ౭ర్థ సంహితమ్          6.83.13
శుభే వర్త్మని తిష్ఠన్తం త్వా మా౭౭ర్య విజితేన్ద్రియమ్
అనర్థేభ్యో న శక్నోతి త్రాతుం ధర్మో నిరర్థకః          6.83.14
భూతానాం స్థావరాణాం చ జ౦గమానాం చ దర్శనమ్
యథా౭స్తి న తథా ధర్మ స్తేన నా౭స్తీతి మే మతిః     6.83.15
యథైవ స్థావరం వ్యక్తం జ౦గమం చ తథా విధమ్
నా౭యమ్ అర్థ స్తథా యుక్త స్త్వ ద్విధో న విపద్యతే  6.83.16
య ద్య౭ధర్మో భవే ద్భూతో రావణో నరకం వ్రజేత్
భవాం శ్చ ధర్మ యుక్తో వై నైవం వ్యసన మా౭౭ప్నుయాత్ 6.83.17
యస్మా ద౭ర్థా వివర్ధన్తే యే ష్వ౭ధర్మః ప్రతిష్ఠితః
క్లిశ్యన్తే ధర్మ శీలా శ్చ తస్మా దేతౌ నిర౭ర్థకౌ            6.83.21
వధ్యన్తే పాప కర్మాణో యద్య౭ధర్మేణ రాఘవ
వధ కర్మ హతో ధర్మః స హతః కం వధిష్యతి         6.83.22
అదృష్ట ప్రతికారేణ తు అవ్యక్తే నా౭సతా సతా
కథం శక్యం పరం ప్రాప్తుం ధర్మేణా౭రి వికర్శన         6.83.24
త్వయి ప్రవ్రాజితే వీర గురో శ్చ వచనే స్థితే
రక్షసా౭పహృతా భార్యా ప్రాణైః ప్రియతరా తవ       6.83.41
ఓ! రాముడా! జితేంద్రియుడవై ధర్మాచరణతో సర్వత్రా శుభకర్మ చేయువానికి ఎల్లప్పుడూ ఆటంకములు కలుగుచుండును. ధర్మము నిరర్థకము అను ప్రశ్న ఉదయించుచుండును. నీ అవస్థ అటులనే యున్నది. ధర్మము నిన్ను కష్టముల నుండి తప్పించుటలేదు. కష్టమే నీ ధర్మమైనది. జీవకోటికి, జడవస్తువులకు ధర్మము అనెడిది యుండదు. అవి ఏవిధమైన ధర్మాచరణ చేయనప్పటికిని వాటికి కష్టములు ఏమియు కలుగక తమ అవస్థల యందు సుఖంగానే యుండును. స్థావర జంగమములకు ఏ ధర్మము లేదు కనుక దుఃఖము లేదు. ధర్మాచరణముతో దుఃఖములను కొనితెచ్చుకొనుట వ్యర్థము. ధర్మమున్నచో రావణుడు నరకమునకు పోయి, నీకు ఎటువంటి ఆపత్తుకలుగకూడదు. పూర్తి జీవితమంతయు ధర్మమును తగిన ప్రతిష్ట గౌరవములతో పోషించువారికి ఏ విధమైన కష్టములు, క్లేశములు ఆపత్తి కలుగ కూడదు. అంచేత ఈ ధర్మ రక్షా ప్రయత్నము వ్యర్థము. ఇదంతయు అదృశ్యము, అవ్యక్తము అయినచో ధర్మాచరణ యొక్క ఆవశ్యకత ఏమి? ఏమి జరుగవలెనో అది జరుగును. రామా! నీవు రాజ్యమును స్వీకరించక పోవుటవలన ధర్మము నెరవేర్చ బడలేదు. ధనము, అంగబలం ఉన్నవారి దగ్గరే అన్ని ఉన్నట్లు. అనేక యుగముల తర్వాత కూడా భర్త్రుహరి తన వైరాగ్య శతకంలో "సర్వే గుణా కాంచనం ఆశ్రయంతి" అనే భావాన్ని ప్రకటించాడు. ఈ వాదన అన్ని కాలముల యందు సమాజములో కొనసాగుచున్నది. రామా! నీవు గురువుల వచనములను పాటించుట ధర్మముగా తలచినావు.అయిననుఁ ప్రియపత్నిని రాక్షసుడు గొనిపోయెను. ధర్మాచరణము వలన అర్థము లేదు. 
పై విధమైన విచారణ అనాత్మవాదులు మరియు "సర్వంక్షణికం" అని భావించెడి వారు చేయునది.  అటువంటి అనాత్మవాదులు క్షణభంగుర వాదులైన వారికి తగిన ప్రత్యుత్తరమిచ్చి భారతీయ సమాజమును మరల వైదిక పరమైన సనాతన తత్వము, ఆత్మవాదమునకు తీసుకొని వచ్చుటకై రామాయణము మార్గదర్శకం చేయబడినది. కేవలము ప్రవచనము చెప్పుట, వినుట వలన గాక ఆచరణ పూర్వకమైన ధ్యేయమును ముందుంచుకొనవలెను. రామాయణ కాలము నందు కూడా వివేకవంతులైన లక్ష్మణుడు వంటి వారుకూడా ధర్మాచరణ, పాపభీతి ఇటువంటి వాదనతో క్షణికముగా విడిచి పెట్టేవారని ద్యోతకమవుతున్నది.
ఈ సంసారము నందు అజేయుడుగా యుండుట కొరకై ఒక యజ్ఞము చేయమని, ఆ యజ్ఞము పూర్తి అగు వరకు వేరొక చోటికి పోగూడదని ఇంద్రజిత్తుకు గురువు చెప్పెను. అందువలన అజ్ఞాత స్థానమున, నలువైపులా గట్టి బందోబస్తు చేసి ఇంద్రజిత్తు యజ్ఞమును ఆరంభించెను. కానీ విభీషణునికి ఆ యజ్ఞ స్థలము తెలియును. యజ్ఞము పూర్తి అయినచో ఇంద్రజిత్తు అజేయుడు అవును గాన ఆ యజ్ఞమును చెడగొట్టి అతని సంహారమే మేలని విభీషణుడు చెప్పగా శ్రీరాముడు లక్ష్మణునికి అనుమతి ఇచ్చెను. లక్ష్మణునికి కర్తవ్యము జ్ఞాపకమునకు వచ్చెను. యజ్ఞము పూర్తిగాకుండా ఇంద్రజిత్తును వధింపవలెను. తన సుఖదుఃఖములు ఎవరు గుర్తించినను, లేకపోయినను  వారి దుఃఖములను, వారే మ్రింగికొని  సమాధాన పరచుకొనవలెను. తమ అశ్రువులను తామే తుడుచుకొనవలెను. అటువంటి గంభీర స్వభావులు, సమాజ హితైభిలాషులు తమను తాము సముదాయించుకొని, మనస్సును ధృడము చేసుకొని, ఆపత్తులపై స్వారీ చేయుచు జీవన మార్గమును నిర్ణయించుకొందురు. అదియే వారి భగవత్ స్వరూపము. సాధారణ వ్యక్తి ఆపత్తులలో మునిగి కొట్టుకొని పోవును. కానీ ధీర పురుషులు క్షణ భంగురమైన లాభములపై మోహమును పొందక తమ ధర్మ చరిత్రను, వ్యక్తిత్వమును నిలబెట్టుకొని సత్యమార్గమునే అనుసరింతురు. అనంతమైన దుఃఖమును సహించుతూ తమ ఆదర్శమును వదిలిపెట్టరు. అటువంటి రామలక్ష్మణులు సమాజమునకు సదా ఆదర్శపురుషులు.
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment