Sunday 23 February 2020

యుద్ధ కాండము-38

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-38
రావణ సంహారము
శ్రీరాముడు యుద్ధమునకు సిద్ధపడగా, రావణుడు రథముతో యుద్ధమునకు సిద్ధపడి వచ్చెను. రావణుడు ఆకాశమునే ఆక్రమించుచున్నాడా లేక భూమినే మ్రోగించుచున్నాడా అనునట్లు తన రథముపై కూర్చొని తన సైన్యమునకు ఆనందము కలుగ జేసెను. రథముతో వచ్చుచున్న రావణుడు మేఘము వర్షధారలను వదిలినట్లు బాణవర్షమును గురిపించెను. ఆ విధముగా సంరంభముతో వచ్చుచున్న రావణుని చూచి, రాముడు మాతలితో అతని రథమునకు ఎదురుగా కుడి (సవ్య దిశలో) వైపు నుండి వెళ్లవలెనని చెప్పెను. ఒకరినొకరు ఎదురెదురుగా నిలిచి ఒకరినొకరు చంపుకొనవలెననే పట్టుదలతో పోరు చేయుచుండిరి. గ్రద్దలు గుంపులు గుంపులుగా రావణుని రథముపై తిరుగాడెను. శకున శాస్త్రజ్ఞుడగు రాముడు ఆ శకునములు చూచి విజయము తప్పక కలుగునని ఉత్సాహముతో అధికమైన పరాక్రమము చూపుచుండెను. రావణుడు గదలు, పరిఘలు, చక్రములు, రోకళ్ళు, పర్వత శిఖరములు, వృక్షములు, శూలములు మాయాశక్తిచే అస్త్రబలము వర్షించెను. రకరకముల అస్త్రములతో రాముని రథముపై, వానరులపై పడుచుండెను. అంతరిక్షము బాణములతో నిండెను. రావణుని చూచి రాముడు వానిపై వందలు, వేలు బాణములను గురిపించెను. ఆ యుద్ధము గగుర్పాటు కల్పించినదియై ఉండెను. కొద్ది సేపటిలో భీకరమైన ఆశ్చర్యజనకమై సర్వలోకము చూడదగినదియై యుద్ధము సాగుచుండెను. గాలి వీచుట మానెను. దేవతలు, ఋషులు ఆకాశమున నిలిచి రామునికి మంగళము పలుకుచుండిరి. ఆ యుద్ధమును చూచి దానికి పోలికగా వేరొకటి చెప్పలేక
గగనం గగనా౭౭కారం సాగర: సాగరోపమ:  6.110.23
రామ రావణయో ర్యుద్ధం రామ రావణయో రివ
ఆకాశము ఆకాశము వలననే యున్నది. సముద్రము సముద్రము వలననే యున్నది. అనుటయే తప్ప వానిని పోలినది చెప్పుటకు ఎట్లు లేదో అట్లే రామరావణుల యుద్ధము చెప్పుటకు పోలిక లేదనుచుండిరి. రామునికి కోపము వచ్చి బాణముతో రావణుని శిరస్సును ఖండించెను. వెంటనే దానిని పోలిన వేరొక శిరస్సు మొలచెను. వెంటనే ఆ శిరస్సును కూడా ఖండించెను. మరల శిరస్సు మొలచెను. ఈ విధముగా నూట ఒక్క సార్లు శిరస్సులను చేధించినను మరల మరల శిరస్సులు మొలచుచు రాముని శ్రమ యంతయు నిష్ఫలము అయ్యెను. ఏ బాణములతో మారీచుడు చంపబడెనో, దేనితో ఖరదూషణాదులు, విరాథుడు, కబంధుడు చంపబడిరో ఆ బాణములన్నియు ప్రయోజనము శూన్యము అయినవి. అప్పుడు రావణుడు ఇంకను జాగ్రత్తగా ఆలోచన చేసి రావణుని గుండెలపై కొట్టెను. కోపము గలవాడై రావణుడు గధలను, ముసలములను వర్షించి రాముని నొప్పించెను. ఆ రాత్రి, మరుసటి పగలు అంతయు ఒక్క క్షణకాలం కూడా విరామము లేకుండా యుద్ధము సాగుచుండెను. రాముడుగాని, రావణుడు గాని జయించుట కానరాలేదు. అప్పుడు మాతలి రామునితో బ్రహ్మాస్త్రము ప్రయోగించమని, అతని మరణకాలము ఆసన్నమైనదని చెప్పెను. మాతలి చెప్పగానే ఆనాడు అగస్త్యుడు తనకు ఇచ్చిన అస్త్రము గుర్తు వచ్చెను. (అరణ్య కాండము 12 వ సర్గ) బుసకొట్టుచున్న పామువలె యున్న బాణమును తీసెను. పూర్వము ఈ బాణమును బ్రహ్మ నిర్మించి ఇంద్రునకు ఒసగినాడు. ఆ బాణమే ఇంద్రుడు అగస్త్యునకు ఇచ్చి శ్రీరామునికి ఒసగమని కోరెను. దానిని రామునకు అగస్త్యుడు ఒసగెను. ఆ బాణము యొక్క ప్రక్క రెక్కల యందు వాయుదేవుడు యుండును. మధ్య అగ్నిసూర్యులు ఉందురు. దానిశరీరము ఆకాశ స్వరూపమై యుండును. బరువులో మేరు పర్వతము, మంధర పర్వతము వలె యుండును.    దాని ములుకులు బంగారముతో అలంకరింపబడి యున్నది. సర్వభూతముల యొక్క తేజస్సులతో, సూర్యకాంతిని బోలిన కాంతితో ఆ బాణము నిర్మింపబడినది. పొగతో నున్న కాలాగ్ని వలె యుండును. విషమున త్రాచు పాము వలె యుండును. ఎన్నియో యుద్ధములలో ప్రయోగించబడుటచే రక్తముతో తడిసి యుండును. మహా భయంకరమైనది. వజ్రసారమైనది. దివ్యాస్త్ర మంత్రమును బాణముపై అభిమంత్రించి మహాబలశాలి యగు రాముడు వేదోక్తమగు విధానంతో ధనస్సున సంధించెను.  అస్త్రము తన ధనుస్సు నందు సంధింపగనే సర్వ భూతములు గడగడలాడినవి. అస్త్రములు మంత్ర రూపముగా యుండును. మంత్ర రూపముగా బాణమును సంధింపగనే వాటికి అట్టి శక్తి కలుగును. రాముడు దానిని ప్రయోగించెను. ఆ బాణము రావణుని హృదయములో దూరి రక్తముతో తడిసి రావణుని ప్రాణములు హరించి భూమిలో ప్రవేశించి మరల రాముని అమ్ముల పొదిలోకి వచ్చి దూరెను. రావణుడు మృతుడగుట చూచి దేవదుందుభులు మ్రోగెను. పుష్ప వర్షము కురిసెను. వానర సేన ఎంతయో హర్షమును పొందెను. ఈ విధముగా రావణ సంహారము ధాత నామ సంవత్సరము ఫాల్గుణ బహుళ అమావాశ్య నాడు జరిగినట్లు బ్రహ్మాండ పురాణము ద్వారా తెలియు చున్నది.
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment