Monday 17 February 2020

యుద్ధ కాండము-33

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-33
రాముని పరాక్రమమునకు రాక్షసులు నిహతులగుట
 
యుద్ధములో విభీషణుని సహాయముతో లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించాడని రావణుని మంత్రులు దూతల ద్వారా సమాచారం తెలుసుకొని రావణునికి నివేదించిరి. ఆ వార్త వినగానే తీవ్రమగు దుఃఖముతో రావణుడు మూర్ఛ నొందెను. అప్పుడు రావణుని ముఖము కోపముతో మహార్ణవములో ప్రళయకాలంలో మొసళ్ళు ఒకచోటికి చేరినట్లు,  అతని కోపము పొగతో అగ్నిహోత్రము బయిటికి వచ్చినట్లు పుత్రవధచే సంతాపము నొందిన రావణుడు కోపమునకు వశమాయెను. వెంటనే సీతమ్మను చంపవలెనని నిర్ణయమునకు వచ్చెను. అప్పుడు రావణుడు రాక్షసులకు ధైర్యమును కలుగజేస్తూ నేను అమోఘమైన తపస్సంపన్నుడును, ఎన్నియో దేవాసుర యుద్ధములలో విజయమును సాధించితిని ఇప్పుడే యుద్ధభూమికేగి రామలక్ష్మణులను చంపెదను అనెను. ఈ విధముగా చెప్పి సీత తనకు లొంగినట్లయితే ఇప్పుడు పుత్రవధ జరిగేదికాదు, అని క్రోధముతో ఆశోకవనములోని సీతమ్మ వద్దకు చేరెను. అప్పుడు సీతమ్మ ఎంతయో దుఃఖించుతూ ఆనాడు హనుమతో వెళ్ళలేకపోతిని, రామలక్ష్మణులను ఈ నీచుడు చంపియుండును అనుకొనుచు దిగులు పడెను. దీనురాలైన సీతమ్మను చూచి సుపార్శ్వుడు అను పేరుగల బుద్ధిమంతుడగు ఒక మంత్రి రావణునితో, "ప్రభూ! నీవు కుబేరుని తమ్ముడవు, కోపమునకు వశబడితివి, వేదవిద్యను పూర్తిచేసి అవబృథ స్నానము చేసినవాడవు, స్వకర్మాచరణమున శ్రద్ధ కలవాడవు, స్త్రీని చంపుట తగదు, నీ కోపమును రామునిపై చూపుము, ఈనాడు కృష్ణ పక్ష చతుర్దశి, ఈ మాసపు కృష్ణ పాడ్యమినాడు యుద్ధము ప్రారంభమాయెను, రేపు అమావాస్య, యుద్ధములో రేపు విజయమును ఆర్జించగలవు, రాముని చంపి సీతను పొందుము" అనెను.  దైవవశముచే 
ధర్మబద్ధమగు అతని మాటలు రావణునికి నచ్చి తిరిగి తన భవనమునకు ఏగెను.
లంకలో యుద్ధము ధాతనామ సంవత్సరము ఫాల్గుణ బహుళ పాడ్యమినాడు ప్రారంభమయినది. ఆనాటి రాత్రియే ఇంద్రజిత్తు నాగాస్త్రముచే రామలక్ష్మణులను బంధించాడు. విదియనాడు ధూమ్రాక్షుడు చనిపోయినాడు. తదియనాడు వజ్రదంష్ట్రుడు మరణించాడు. చవితినాడు అకంపనుడు, పంచమినాడు ప్రహస్తుడు అంతమొందినారు. షష్ఠినాడు రావణుని కిరీటము నిలబడినది. సప్తమినాడు కుంభకర్ణుని వధ. అష్టమినాడు అతికాయుడు మొదలగువారు నుడివినారు. నవమినాడు ఇంద్రజిత్తు యుద్ధమునకు వచ్చినారు. ఆరాత్రి కుంభనికుంభులు చనిపోయినవారు. దశమినాడు మకరాక్షుడు చనిపోయినాడు. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి తిథులలో ఇంద్రజిత్తుతో యుద్ధము జరిగినది. అప్పుడు ఇంద్రజిత్తు మరణించాడు. చతుర్దశి నాడు రావణుడు రామునితో యుద్ధమునకు బయిలుదేరుతున్నాడు.
 
సుపార్శ్వుని ఉపదేశముతో రావణుడు దీనుడై సభలో ప్రవేశించి అందరిని యుద్ధమునకు వెళ్ళవలసినదిగా ఆదేశించెను. అప్పుడు లంకలోని మూలబలము మొత్తము యుద్ధమునకు బయలుదేరి భయంకరముగా యుద్ధము చేసిరి. అప్పుడు ఆ వానరులందరూ శ్రీరాముని శరణు జొచ్చిరి. వెంటనే రాముడు మహాపరాక్రమముతో ధనస్సుపట్టి యుద్ధములో ప్రవేశించెను. కొరివి గుండ్రముగా త్రిప్పినప్పుడు ఒకే చక్రము తిరుగుతున్నట్లు ఎట్లు కనబడునో అట్లే గుండ్రముగా వంచి ధనస్సుతో బాణములను సంధించి ప్రయోగించినప్పుడు రాముడు చక్రమునకు మధ్యలో నాభివలె ఒప్పుచుండెను. ఒక్కసారి వేలకొలది బాణములను సంధించి వదులుచుండగా ఎడతెగక వింటినారి ఘోష వినపడుచుండెను. రాముని శరీరమే ఆ ధనుశ్చక్రమునకు మధ్య నాభివలె, అతని తేజస్సే ఇరుసువలె, వింటినారి ధ్వని చక్రపు ధ్వనివలె, వంచిన విల్లు, చక్రము యొక్క నేమివలె, రాముని తేజస్సు; బాణప్రయోగములో చూపు నేర్పరి ప్రభ వలె కనబడుచుండెను. కామరూపులైన రాక్షసులతో రాముడు ఒక్కడే యుద్ధము చేయుచుండెను. సూర్యోదయమునకు ప్రారంభించిన యుద్ధములో పగలు ఎనిమిది ఆగములు అగుసరికి రాక్షస సైన్యము అంతయు నశించెను. అప్పుడు రాముడు తన వెంట యున్న సుగ్రీవ, విభీషణ, హనుమ, జాంబవంతులతో (ఏత ద౭స్త్ర బలం దివ్యం మమ వా త్ర్యమ్బకస్య వా) "ఈ బలము రుద్రునికి నాకే యున్నది. ఇట్టి బలము ఇంకొకరికి లేదు" అనెను. ఇక్కడ శ్రీరామునికి, శివుడికి మధ్య అబేధమును తెలియుచున్నది. ఇంత యుద్ధము చేసిననుఁ రాముడు ఏమియు బడలిక చెందలేదు.
 

No comments:

Post a Comment