Friday 14 February 2020

యుద్ధ కాండము-30

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-30
 
ఇంద్రజిత్తు మాయాసీతను సృష్టించి హనుమ ఎదురుగా చంపివేయుట
శ్రీరాముని మనోభావములను గుర్తించి, ఇంద్రజిత్తు యుద్ధరంగము నుండి మరలి లంకానగరమున ప్రవేశించెను. ఇంద్రజిత్తు మాయచే సీతను కల్పించి రథముపై కూర్చుండబెట్టి ఆమెను చంపుటకు సిద్ధపడెను. రథముపై ఏకవేణితో యున్న సీతను హనుమ చూచి మిగుల చింతాక్రాంతుడయ్యెను. అప్పుడు అడ్డుకొనుటకు హనుమ వానరులతో కూడి ఇంద్రజిత్తు రథమును చేరుకొనుటకు పరిగెత్తెను. అప్పుడు ఇంద్రజిత్తు తన ఒర నుండి కత్తిని లాగి కొట్టుచుండగా, సీత రామా! రామా! అని అరచుచుండెను. ఇంద్రజిత్తు హనుమతో "రాముడు ఎవతె కోసమై వచ్చినారో అట్టి సీతను చంపెదను" అని చెప్పి హనుమ చూచుచుండగా ఆ మాయాసీతను చంపెను. హనుమ వానరులకు ధైర్య వచనములు చెపుతూ ఇంద్రజిత్తును ఎదిరించుటకు సిద్ధపడెను. తరువాత ఇంద్రజిత్తు వారిపై తీవ్రమైన బాణప్రయోగము చేసెను. అప్పుడు హనుమ వానరులతో సహా ఈ విషయము రామలక్ష్మణులకు ఎరిగించుటకై వెనుకకు మరలెను. హనుమ వెనుకకు వెళ్ళుట గమనించి ఇంద్రజిత్తు ఇదే సమయమని నికుంభిలా హోమము చేయుటకు సిద్ధపడెను. యజ్ఞభూమిలో శాస్త్రోక్తముగా అగ్నిని ప్రజ్వలింప జేసెను. మాంసముతో, రక్తముతో అగ్నిని సంతృప్తి పరచు చుండెను. ఇంతలో హనుమ రాముని వద్దకు చేరి దుఃఖియై మేము చూచుచుండగానే ఇంద్రజిత్తు సీతమ్మను చంపినాడు అని చెప్పెను. ఆ మాట వినగనే రాముడు మొదలు నరికిన చెట్టు వలె మూర్ఛనొంది నేలపై పడిపోయెను. రాముని దుఃఖమును చూచి లక్ష్మణుడు అతనిని ఎంతయో ఊరడించెను. అప్పుడు విభీషణుడు శ్రీరామునితో "రామా! దురాత్ముడైన రావణుడు అభిప్రాయమును నేను ఎరుగుదును. ఎట్టి క్లేశము వచ్చినను సీతమ్మపై యున్న మోహముచే చంపుటకు సిద్ధపడడు. ఎన్ని బాధలైనను సహించును గాని సీతమ్మను నీకు అప్పగిచ్చుటకు ఒప్పుకొనలేదు. రాక్షసుడగు ఇంద్రజిత్తు వానరులను మోహమున బడవేసి నికుంభిలా హోమము చేయుటకు వెడలెను. ఆ హోమము పూర్తి కాక మునుపే సేనా సహితముగా ఆ మందిరమునకు వెడలవలెను. హోమము పూర్తియైనచో అతడు అవధ్యుడు. హోమము వదలి అతడు బయిటకు వచ్చునట్లు చేయవలెను. కావున మా వెంట లక్ష్మణుని పంపుము" అని చెప్పెను.  అందుకు శ్రీరాముడు అనుజ్ఞ యిచ్చెను.
 
అక్కడ కొంత దూరములో వ్యూహాత్మకంగా నిలిచి యున్న ఇంద్రజిత్తు బలములను గాంచెను. ఇంద్రజిత్తు వద్దకు సమీపించి అతడు చేయుచున్న యాగమును భగ్నమొనర్చుటకై సన్నద్ధుడై దుర్భేధ్యముగా యున్న ఆ రాక్షస బలమందు లక్ష్మణుడు ప్రవేశించెను. అప్పుడు విభీషణుడు, లక్ష్మణునితో ఈ అభిచార హోమ కార్యములు ముగియక మునుపే ఈ రాక్షస సేనను మట్టి గరిపించినచో ఇంద్రజిత్తు మనకు కనపడును. విభీషణుని సూచనతో లక్ష్మణుని సారథ్యములో హనుమదదాది వానరాలు ఒక్కసారిగా ఇంద్రజిత్తు మరియు అక్కడున్న సమస్త వానర సేనలు ఆక్రమణ చేసిరి. అందుకు కినుక వహించిన ఇంద్రజిత్తు స్వయముగా హనుమతో యుద్ధమునకు పూనుకొనెను. అది చూచి లక్ష్మణునితో, విభీషణుడు; "లక్ష్మణా! ఆ రావణ కుమారుడు ఇంద్రుని జయించాడు. కావున అతనిని వెంటనే సంహరింపుము" అనెను. అంతియేగాక ఇంద్రజిత్తు చేయుచున్న హోమమును, అక్కడ భూతములకు బలి ఇచ్చు మర్రిచెట్టును విభీషణుడు లక్ష్మణునికి చూపి, ఇంద్రజిత్తు ఆ మర్రిచెట్టు వద్దకు రాకుండా నివారింప వలెనని చెప్పెను. లక్ష్మణుడు ఆ మాటలను విని తన ధనస్సుతో చిత్రవిచిత్రములుగా ధ్వని చేయుచు ఇంద్రజిత్తును యుద్ధమునకు పిలిచెను. లక్ష్మణుని వెనుక యున్న విభీషణుని చూచి ఇంద్రజిత్తు ఈ విధముగా దూషించెను.
 
గుణవాన్ వా పరజనః స్వజనో నిర్గుణోఽపి వా
నిర్గుణః స్వజనః శ్రేయాన్ యః పరః పర ఏవ సః        6.87.15

య: స్వపక్షం పరిత్యజ్య పరపక్షం నిషేవతే
స స్వపక్షే క్షయం ప్రాప్తే పశ్చాత్ తై రేవ హన్యతే        6.87.16
 
శత్రువు గుణవంతుడే గావచ్చు. తనవారు గుణము లేనివారే గావచ్చు. గుణము లేనివారైనను తనవారితో కలసి యుండుటయే శ్రేయస్కరము. ఎప్పుడైనను శత్రువు శత్రువే. తన పక్షమును వీడి పరపక్షమును ఒకనాడు చేరినను, తనవారు అందరూ చనిపోయిన తర్వాత శత్రువు వానిని కూడా తప్పక చంపును. అప్పుడు విభీషణుడు ఇంద్రజిత్తుతో "రాక్షసా! నా స్వభావమును నీవు ఎరుగుదవు. అపౌరుష్యమును వదిలము.
 
ధర్మాత్ ప్రచ్యుత శీలం హి పురుషం పాప నిశ్చయం 6.87.21
 
త్యక్త్వా సుఖ మ౭వాప్నోతి హస్తా దా౭౭శీ విషం యథా
హింసా పరస్వ హరణే పర దారా౭భిమర్శనం                          6.87.22

పరస్వానాం చ హరణం పర దారా౭భిమర్శనమ్       6.87.23
సుహృదా మ౭తి శ౦కా౦ చ త్రయో దోషాః క్షయావహాః

దర్మ భ్రష్టమైన శీలము గలవాడు, పాపపు తలంపులు గలవాడు, అగు పురుషునకు దూరముగా యున్నవాడు తీవ్రమగు విషముగల పాముకు దూరమగునట్లు సుఖము గలుగును. దర్మ భ్రష్టమైన శీలము గలవాని ఇల్లు ఎంత ప్రమాదకరమో హింస, పరధన అపహరణము, పర భార్యాస్పర్శనము అంత ప్రమాదకరములు. నిప్పు అంటుకొనిన ఇంటిని ఎలా విడువ వలెనో అట్లే పరధనమును, పరభార్యను చేపట్టిన వానిని కూడా విడువవలెను. పరధనమును హరించుట, పరస్త్రీని కూడుట, తనను ప్రేమించిన మిత్రుని శంకించుట అను మూడు దోషములు మనుజునికి వినాశనమును తెచ్చి పెట్టును. ఈ దోషములచే నా సోదరుడు వినాశనమును కొని తెచ్చుకొన్నాడు. నీవు బాలుడవు. ఆ మర్రిచెట్టులో ప్రవేశింపజాలవు. రామలక్ష్మణులను ఎదిరించి బ్రతుకుట కష్టము. ఈ విధముగా విభీషణుడు ఇంద్రజిత్తుతో పలికినాడు.
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment