Friday 10 January 2020

సుందర కాండము-20


 యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-20
దూతను వధింప తగదు అని విభీషణుడు రావణునికి హితము చెప్పుట
రాక్షస రాజైన రావణుడు తలపెట్టిన దూతను సంహరించుట అనే ఇట్టి కార్యమును నివారించుటకై  అంతఃశత్రువులను జయించిన వాడు, కర్తవ్య-అకర్తవ్య నిశ్చయము కలవాడు అయిన విభీషణుడు వినమ్రుడై హితకరములైన వచనములు ఇట్లు పలికెను.
 
రాజధర్మ విరుద్ధం చ లోక వృత్తే శ్చ గర్హితమ్
 తవ చా౭సదృశం వీర కపే ర౭స్య ప్రమాపణమ్   5.52.6
 
ధర్మజ్ఞ శ్చ కృతజ్ఞ శ్చ రాజ ధర్మ విశారదః
 పరావరజ్ఞో భూతానాం త్వ మేవ పరమా౭ర్థవిత్          5.52.7
 
గృహ్యన్తే యది రోషేణ త్వాదృశో౭పి విపశ్చితః
తత శ్శాస్త్ర విపశ్చిత్త్వం శ్రమ ఏవ హి కేవలం             5.52.8
 
తస్మా త్ప్రసీద శతృఘ్న రాక్షసేంద్ర దురాసద
యుక్తా౭యుక్తమ్ వినిశ్చిత్య దూత దండో విధీయతాం   5.52.9
 
"రాక్షసేంద్రా! కోపమును వీడి ప్రసన్నుడవు కమ్ము. చేయదగినది, చేయరానిది ఎరిగిన ప్రభువులు దూతను సంహరించరు. అది రాజ ధర్మమునకు విరుద్ధము. లోకపు తీరులో వింద్యము. నీ వంటి వారు చేయుట తగనిది. అన్నియు తెలిసినవాడవు. పరమార్ధవేత్తవు. నీ వంటి విద్వాంసులు కోపమునకు లొంగరాదు. కావున యుక్తాయుక్తములు ఆలోచించి తగిన దండన విధింపుము". అనెను. రావణుడు విభీషణుని మాటలను విని మిక్కిలి రోషావేషముతో "న పాపానాం వధే పాపం విద్యతే శత్రుసూదన" - పాపాత్ములను చంపుటలో పాపము లేదు కాన ఈ వానరుని చంపెదను అనెను. అందుకు విభీషణుడు వినమ్రతతో "రాక్షసేశ్వరా! అన్ని దేశములలో, అన్ని జాతులలో దూతలను చంపకూడదని చెప్పుదురు. ఈతను దూతయె కాదు, అక్షకుమారుడు మున్నగువారిని సంహరించుటచే ఈతను శత్రువు. అందుకు సందేహము లేదు. కాని దూతను చంపుట ఆచారము కాదు కావున దూతకు అనేకమైన శిక్షలు విధించవచ్చు. వైరూప్య మ౭౦గేషు కశా౭భి ఘాతో, మౌణ్డ్యం తథా లక్షణ సన్నిపాతః, ఏతాన్ హి దూతే ప్రవదన్తి దణ్డాన్  వధ స్తు దూత స్య న నః శ్రుతోఽపి - అంగములకు హాని కలిగింప వచ్చును. కొరడాలతో కొట్టించ వచ్చు. జుట్టు గొరిగించ వచ్చు. శరీరముపై వాతలు వేయ వచ్చు. దూత వధ కాకుండా ఈ విధమైన ఏవైనా శిక్షలు విధించవచ్చు. ధర్మార్థములు తెలిసిన వాడివి కావున ఈ కోతిని కాకుండా, ఇట్టి కోతిని పంపిన వాడిని చంపుట యుక్తము. ఈ కోతిని చంపినచో వేరొకడు నూరు యోజనముల సముద్రమును దాటి ఇచ్చటకు రాలేరు, యుద్ధమునకు ఉత్సాహపడుతున్న ఇతనిని పంపిన వారితో యుద్ధము చేయు అవకాశము పోవును" అనెను. అందుకు రావణుడు దేశకాలోచితముగా అలోచించి, కోతులకు తోక ప్రియము కావున దానిని కాల్చివేయుదు అని ఆజ్ఞాపించెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment